రైతు దీక్ష‌ను విజ‌య‌వంతం చేద్దాం

-కరువు మండలాల ప్రకటనతో ప్రయోజనం ఏదీ?
-రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తి విఫలం
–వైయ‌స్‌ఆర్ సీపి జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి

నెల్లూరు( వెంకటాచలం): రైతాంగాన్ని అదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయ‌స్‌ఆర్ సీపి జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. వెంకటాచలంలో విలేకర్ల సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 27మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం జరిగిందన్నారు. అయితే రబీ సీజన్‌దాటినా ఒక్క మండలంలోనూ ఇన్‌పుట్‌సబ్సిడీ, ప్రభుత్వ సహాయక చర్యలు అందలేదన్నారు. రబీ సీజన్‌వచ్చే సరికి జిల్లాలోని 46మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని టీడీపీ నేత‌లు గొప్పలు చెప్పుకుంటున్నారని, కరువు మండలాలు ప్రకటించడం వల్ల రైతులుకు కలిగిన ప్రయోజనం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.5వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధితో ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి చంద్రబాబు రైతులను మోసం చేశారని విమర్శించారు. రైతుల ఉసురు టిడిపి ప్రభుత్వానికి కచ్చితంగా తగులుతుందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం రైతాంగాన్ని అన్ని విధాలా మోసం చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలియజేశారు. నీరు–చెట్టు పథకంలో కోట్లు దోచుకుతిన్న టీడీపీ నాయకులు సాగు,తాగునీరు పంపిణీల్లోనూ మితిమీరిన జోక్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుభవం లేని వ్యక్తులను నీటిసంఘాల అధ్యక్షులుగా ఎన్నుకోవడంతో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయన్నారు. రాజకీయాలను పక్కనబెట్టి తాగునీరు సక్రమంగా పంపిణీ చేయించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు.

వైయ‌స్ జగన్ దీక్షను విజయవంతం చేయండి
రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో ప్రతిపక్షనేత, వైయ‌స్ జగన్‌మెహన్‌రెడ్డి గుంటూరులో దీక్షకు పూనుకున్నారని కాకాణి తెలియజేశారు. దీక్షా కార్య‌క్ర‌మంలో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీపీ తలపల అరుణ, జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య, మండల ఉపాధ్యక్షులు శ్రీధర్‌నాయుడు, పార్టీ మండల కన్వినర్ చెంచు కృష్ణయ్య, యువజన విభాగం మండల అధ్యక్షులు ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, జిల్లా కోఆప్షన్‌సభ్యులు అక్భర్‌భాష, మండల కోఆప్షన్‌సభ్యులు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Back to Top