బిల్లు పంపొద్దని రాష్ట్రపతికి కలుస్తాం

చంద్రగిరి (చిత్తూరు జిల్లా) :

అత్యధిక శాతం రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని భయపడే విభజన బిల్లుపై అసెంబ్లీలో తిరస్కరణ తీర్మానాన్ని ఆమోదించినట్లు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్రను కోరుకునే వారందరికీ ఇది సంతోషించదగ్గ వార్త అన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మనసు మారి విభజన బిల్లును వెనక్కు పంపుతున్నారంటే ఆ ఘనత ప్రజలదే అన్నారు. ‘సమైక్య శంఖారావం యాత్ర’లో ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా చేసిన ‘జై సమైక్యాంధ్ర’ నినాదం అవకాశవాద రాజకీయ నాయకుల గుండెల్లో సింహనాదమైందన్నారు. ఆ నినాదం అసెంబ్లీలోనూ మార్మోగిందన్నారు. చివరకు విభజన బిల్లును వెనక్కు తిప్పి పంపేందుకు కారణమైందని శ్రీ జగన్‌ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో నాలుగవ విడత ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ చివరి రోజు గురువారం చంద్రగిరి నియోజకవర్గంలో సాగింది. 11వ రోజు యాత్రలో భాగంగా చంద్రగిరిలో జరిగిన బహిరంగ సభలో శ్రీ జగన్ ప్రసంగించారు.
‌‘రాష్ట్ర విభజన బిల్లును వెనక్కి పంపాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇది సంతోషించదగ్గ పరిణామం. అయితే నిన్నటి దాకా సోనియా గీచిన గీత దాటకుండా కిరణ్, ప్యాకేజీల కోసం కుమ్మక్కు రాజకీయాల్లో మునిగిపోయిన చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా తామే సమైక్య చాంపియన్లం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. తన కొడుకును ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకు మన రాష్ట్రాన్ని విభజించేందుకు సోనియా గాంధీ పూనుకొన్న మరుక్షణమే ‘మా రాష్ట్రాన్ని విడగొట్టే హక్కు మీకెక్కడుంది?’ అని కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా పత్రాన్ని ఆమె ముఖాన పడేసి వస్తే పరిస్థితి ఇంత వరకూ వచ్చేదా? అని శ్రీ జగన్‌ ప్రశ్నించారు.

ఉవ్వెత్తున ఉద్యమిస్తున్న ఉద్యోగులను బెదిరించి సమ్మెను కిరణ్ విరమింపచేశా‌రని శ్రీ వైయస్‌ జగన్‌ విమర్శించారు. ఢిల్లీ నుంచి వచ్చిన బిల్లును 17 గంటల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టారన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు తన పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేల చేత సమైక్యాంధ్ర అనిపించి, తెలంగాణ ఎమ్మెల్యేల చేత రాష్ట్ర విభజన నినాదం చేయిస్తారని దుయ్యబట్టారు. ఈ క్షణం వరకూ చంద్రబాబు నోట ‘సమైక్యాంధ్ర’ మాటే రాలేదేం అని ప్రశ్నించారు. పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి జడిసి వీరిద్దరూ విభజన బిల్లును వెనక్కి పంపడానికి నిర్ణయించారన్నారు. ఇతర పార్టీలు ప్రాంతానికో మాట మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్న వేళ.. కార్యకర్త మొదలు పార్టీ అధ్యక్షుడి వరకూ ‘సమైక్యాంధ్ర’ కోసం రాజీలేని పోరాటం చేసింది ఒక్క వైయస్‌ఆర్ కాంగ్రెస్ మాత్రమే‌ అన్నారు.

రాజకీయాల్లో విశ్వసనీయతకు, నిజాయితీకి మారుపేరుగా మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి నిలిస్తే వంచనకు, కుమ్మక్కుకు, వెన్నుపోటుకు ప్రతీకగా చంద్రబాబు చరిత్రలో స్థిరపడిపోయారని శ్రీ జగన్‌ వ్యాఖ్యానించారు. మహానేత మరణించాక రాష్ట్రానికి కష్టాలొచ్చాయని ఆవేదన వ్యక్తంచేశారు. సోనియా తన కొడుకు కోసం ప్రజల భవిష్యత్తును అంధకారం చేసేలా రాష్ట్రాన్ని విభజించే ప్రయత్నం చేస్తోందన్నారు. దివంగత మహానేత స్ఫూర్తితో విభజన ప్రయత్నాలను వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తుది‌వరకూ అడ్డుకుంటుందన్నారు.

ఇకపై సమైక్య పోరాటాన్ని వైయస్‌ఆర్‌సీపీ ఢిల్లీ స్థాయిలో కూడా కొనసాగిస్తుందన్నారు. అమ్మ విజయమ్మ, నేను, మన పార్టీ ఎమ్మెల్యేలు అందరం రాష్ట్రపతిని కలుస్తాం. అసెంబ్లీ వెనక్కి తిప్పి పంపిన బిల్లును పార్లమెంటుకు పంపడం భావ్యం కాదని ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తాం. ఈ లోపు ఎన్నికల్లో మనం 30 పార్లమెంటు స్థానాలను సాధించి సమైక్యాంధ్రను శాశ్వతం చేసుకుందాం’ అని పిలుపునిచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top