హోదా వచ్చేవరకు పోరాడుతాం

  • సీతారాం ఏచూరితో వైయస్ జగన్ బృందం భేటీ
  • ప్రత్యేకహోదా కోసం మద్దతు కోరిన వైయస్ జగన్
  • పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాలి
  • కేంద్రాన్ని డిమాండ్ చేసిన వైయస్ జగన్, ఏచూరి

న్యూఢిల్లీః రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధించేందుకు ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్ని  పార్టీల మద్దతు కూడగడుతున్నారు. ఈక్రమంలోనే కొద్దిసేపటి క్రితం పార్టీ ఎంపీలతో వెళ్లి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని పార్టీ కార్యాలయంలో కలుసుకున్నారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ...ప్రత్యేకహోదా కోసం అందరం కలిసికట్టుగా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.  ప్రత్యేక  హోదా సాధించే వరకు పోరాటం వదిలి పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అన్నారు. 

ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రత్యేక హోదా హామీ అమలు చేయకుంటే పార్లమెంట్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు పోరాటం చేస్తూనే, మరోవైపు ఇతర పార్టీలను కలుపుకుని పార్లమెంట్ లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. వైయస్ జగన్ తో పాటు సీతారాం ఏచూరిని కలిసిన వారిలో విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుక, వైయస్ అవినాష్ రెడ్డి తదితరులున్నారు.

ఈసందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా? ఒకవేళ ఇస్తే మిగతా రాష్ట్రాల నుంచి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి? అనే చర్చ ఇప్పుడు అనవసరమని చెప్పారు.  విభజన సమయంలోనే ఏపీకి హోదా ఇస్తామని పార్లమెంట్ హామీ ఇచ్చిందన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్.. 'ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామ చెబితే... ప్రతిపక్ష సభ్యుడైన వెంకయ్య నాయుడు లేచి.. ఐదేళ్లుకాదు మేం(బీజేపీ) అధికారంలోకి వస్తే 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారన్నారు. ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని మర్చిపోయారన్నారు.  పోరాటాలతోనే హోదా దక్కుతుందని, అందుకు సీపీఎం అన్నివిధాలుగా వైయస్సార్సీపీకి సహకరిస్తుందని చెప్పారు.
తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top