అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో సమస్య పరిష్కారం


ఎవరూ అధైర్య పడొద్దు, ఆత్మహత్యలకు అసలే పాల్పడొద్దు
22, 23 తేదీల్లో మండల కేంద్రాల్లో రిలే దీక్షలు
30వ తేదీన జిల్లా కేంద్రాల్లో ధర్నా
ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం ఉధృతం చేద్దాం
వైయస్‌ జగన్‌ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన రెండు నెలల్లో రూ. 12 వందల కోట్లు రిలీజ్‌ చేసి అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని వైయస్‌ జగన్‌ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులతో వైయస్‌ఆర్‌ సీపీ అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కమిటీ కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, అధికార ప్రతినిధి పార్థసారధి, మల్లాది విష్ణు, ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నట్లు నటిస్తోందని, ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా అగ్రిగోల్డ్‌ బాధితల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి 19 లక్షల కుటుంబాలకు ఓట్ల కోసమైనా ఎంతోకొంత ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. 

అగ్రిగోల్డ్‌ బాధితులు ఎవరూ అధైర్యపడొద్దని, వైయస్‌ జగన్‌ బాధితులకు అండగా ఉంటారని సజ్జల భరోసా ఇచ్చారు. అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ పిలుపు మేరకు మండల స్థాయి నుంచి బాధితుల జాబితాను తయారు చేయాలని, అదే విధంగా బాధితులకు తెలిసిన అగ్రిగోల్డ్‌ ఆస్తుల వివరాలను కమిటీకి తెలియజేయాలన్నారు. వాటిని ప్రభుత్వం మింగేయకుండా కాపాడుకుందామన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేలా ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షలు జరపాలని, అదే విధంగా 30వ తేదీ జిల్లా కేంద్రాల్లో బాధితులతో సభ జరపాలని కమిటీ నిర్ణయించిందన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం ఉధృతం చేద్దామని పిలుపునిచ్చారు. మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తే బాధితుల్లో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉన్నారనే ఆలోచన వస్తుందని ఫలితంగా ఆత్మహత్యలు ఆగిపోతున్నాయన్నారు. నాలుగు నెలల్లో వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక బకాయిలు వస్తాయనే నమ్మకం ఉంటుందన్నారు.
 
వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగ్రిగోల్డ్‌ కుంభకోణం వెనుక ఉన్నవారిని గుర్తించి దోషులను భవిష్యత్తులో ఇలాంటి స్కామ్‌లకు పాల్పడాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటామని సజ్జల అన్నారు. అదే విధంగా రెండు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. బాధితులు కృతనిశ్చయంతో చంద్రబాబు దుర్మార్గపు పాలనను అంతమొందించేందుకు బాధ్యత తీసుకోవాలని కోరారు. 
Back to Top