జగన్‌ మా నాయకుడని గర్వంగా ఉంది: శోభా

హైదరాబాద్, 31 ఆగస్టు 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌ని చూస్తే చాలా గర్వంగా ఉందని పార్టీ ఎమ్మెల్యే భూమా శోబా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నిరవధిక నిరాహార దీక్ష చేసిన శ్రీ జగన్‌ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు తమకు సంతోషంగా ఉందన్నారు. నిమ్సు ఆస్పత్రి వద్ద శనివారం మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు, పార్టీ కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారన్నారు. 'మీరు నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు.. నేను ఐదు కోట్ల మందికి జరిగే అన్యాయం గురించి ఆలోచిస్తున్నాను అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి వైద్యులతో' అన్న విశాల హృదయుడని శోభా నాగిరెడ్డి తెలిపారు. చిత్తశుద్ధితో ఆయన దీక్ష చేశారన్నారు.

చంద్రబాబు నాయుడిది వెన్నుపోటు యాత్ర అని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని సీమాంధ్రలో బస్సు యాత్ర చేస్తారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై కేంద్రానికి తాను ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకున్న తరువాతే చంద్రబాబు నాయుడు యాత్ర చేయాలని ఆమె సూచించారు.

కాగా, శ్రీ జగన్మోహన్‌రెడ్డి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిమ్సుకు తరలి వస్తున్నారు. వారితో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ నెట్టి వేశారు. పోలీసుల చర్యను నిరసిస్తూ అభిమానులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Back to Top