పార్టీని విడిచి వెళ్ళే ప్రసక్తే లేదు: బొడ్డు, తోట

హైదరాబాద్:

వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని వీడిపోతున్నా‌రంటూ ఒక పత్రికలో వచ్చిన కథనం అసత్యం, అవాస్తవం, హాస్యాస్పదం అని పార్టీ ఏలూరు లోక్‌సభా నియోజకవర్గం పరిశీలకుడు తోట చంద్రశేఖర్, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు స్పష్టం చేశారు. ఆ పత్రికలో ఇలాంటి కథనాలు రాసే ముందు మీడియా విలువలు పాటించి తమను కూడా వివరణ కోరి ఉంటే బాగుండేదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ వీడుతున్నట్లు వచ్చిన కథనాలను ఖండించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీని పటిష్టం చేయడానికి మేమంతా ప్రజల్లో విస్తృతంగా తిరుగుతుంటే ఇలాంటి తప్పుడు కథనాలు రావడం విడ్డూరం అని తోట చంద్రశేఖర్‌ అన్నారు. ఏలూరు లోక్‌సభా నియోజకవర్గం పరిధిలో ఉన్న మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలనూ గెల్చుకునే దిశగా తాము ప్రయత్నిస్తున్నాం అన్నారు. ప్రత్యర్థి పార్టీల వారు, పార్టీ టికెట్లు ఆశించి భంగపడిన వారు పనిగట్టుకుని తమ పార్టీలో నేతలకు గౌరవం లేదనే ప్రచారం చేస్తున్నారన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదన్నారు.

‘మిడిల్ డ్రాప్’ అనే శీర్షికన వార్త ప్రచురించిన ఆ పత్రిక యజమానికి పేకాట బాగా అలవాటేమో, అందుకే అలాంటి వార్తలు రాస్తున్నా‌ని బొడ్డు భాస్కర రామారావు నిప్పులు చెరిగారు. రానున్న 20, 30 ఏళ్ల పాటు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డితో కలిసి నడవాలనే ఉద్దేశంతోనే నా కుమారుడు వెంకటరమణ చౌదరి పార్టీలో చేరి విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. తాను 1972 నుంచీ సర్పంచ్‌గా, జిల్లా పరిషత్ ఛైర్మ‌న్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి వ్యక్తిత్వం ఉన్న నాయకుడినని, తనపై ఇలాంటి రాతలు రాయడమేంటి? అని ప్రశ్నించారు. ఓ పత్రిక తమ సర్క్యులేషన్ పెంచుకోవడానికి, ఓ చానె‌ల్ తన రేటింగ్ పెంచుకోవడానికి ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసి పార్టీ కార్యకర్తలు వాటి యాజమాన్యాలకు గుణపాఠం చెప్పే పరిస్థితి రానీయవద్దని సూచించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top