హంద్రీ- నీవా పూర్తి కోసం లక్ష సంతకాల సేకరణ

అనంతపురం: హంద్రీ- నీవా ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీసీ ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. వైఎస్సార్ సీసీ ఎమ్మెల్యే వై విశ్వనాథరెడ్డి, మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి మంగళవారం అనంతపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెఎస్సార్ సీపీ నేతలు మాట్లాడుతూ హంద్రీ- నీవాపై సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రాజెక్టు పూర్తికి రూ.1500 కోట్లు అవసరం ఉండగా కేవలం రూ.200 కోట్లు మాత్రమే విదిలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరువుతో అల్లాడుతున్న రాయలసీమను సస్యశామలం చేయాలనే ఉద్దేశంతో హంద్రీ- నీవాకు మహానేత వైఎస్సార్ రూ.5 వేల కోట్లు ఖర్చుచేసిన విషయాన్నిగుర్తుచేశారు. సాగునీటికోసం ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టుగా మార్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టు పూర్తిపై జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. రాయలసీమ వాసుల కష్టాలను పట్టించుకోకుండా కమిషన్ల కోసం పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని విమర్శించారు. హంద్రీ- నీవా పూర్తికావలంటే సీమ వాసులు ఏకమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
Back to Top