విప్ ఉల్లంఘించాం.. వేటు వేయండి

హైదరాబాద్, 05 ఏప్రిల్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేసిన తమ శాసన సభ్యత్వాలు రద్దు చేయాలని కాంగ్రెస్, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకరుకు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ చేపట్టిన కరెంటు సత్యాగ్రహంలో కూడా దీక్షకు కూర్చున్నామని వారు ఆ లేఖలో తెలిపారు. తమపై అనర్హత వేటు వేయాలని వారు స్పీకరును కోరారు. ఖాళీలను నోటిఫై చేసి ఉప ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. సెక్షన్ 151 ప్రకారం ఎన్నికలకు అవకాశం కల్పించాలన్నారు. మాటపై నిలబడి ఎంత కష్టాన్నయినా భరిస్తున్న తమకు శ్రీ జగన్మోహన్ రెడ్డే స్ఫూర్తని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతిస్తుడడం వల్లే కాంగ్రెస్ పార్టీ ధరలను అడ్డగోలుగా పెంచుతోందని తెలిపారు. స్పీకరు నాదెండ్ల మనోహర్‌కు రాసిన లేఖపై సంతకాలు చేసిన వారిలో టి. వనిత, ప్రవీణ్ కుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి, అమర్నాధరెడ్డి, పి. సాయిరాజు,శివప్రసాద రెడ్డి, జోగి రమేష్, సుజయ కృష్ణ రంగారావు, గొట్టిపాటి రవికుమార్, పేర్ని నాని, రాజేష్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ఉన్నారు.

వారు స్పీకరుకు రాసిన లేఖ పూర్తి పాఠం..
మాన్యులైన శాసన సభ స్పీకరు గారికి.. వైయస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేల బహిరంగ విజ్ఞప్తి


స్పీకర్ సర్!
ఇటీవల శాసన సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా మా పార్టీలతో విభేదించి మేము ఓటింగులో పాల్గొన్న విషయం మీకు తెలిసిందే. మా అనర్హత విషయం మీద సత్వరం మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈరోజు కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ నేతృత్వంలో జరుగుతున్న కరెంటు సత్యాగ్రహం నిరాహార దీక్షలో మేం పాల్గొన్నాం.

సర్!
మేమంతా నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశాం. పదవులు పోతాయని తెలిసినా.. పదవికి అనర్హులమవుతామని తెలిసినా.. మాటకోసం నిలబడి ఎంతటి కష్టాన్నయినా భరిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డిగారిని స్ఫూరన్తిగా తీసుకున్నాం. ప్రజల తరఫున నిలబడి ధైర్యంగా ఓటు వేశాం. మైనార్టీలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజున ఇంత అడ్డగోలుగా చార్జీలు, రేట్లు ఎలా పెంచగలుగుతోందీ అంటే- అరకొరకగా కరెంటు సరఫరా చేస్తూ, మరోవంక కరెంటు బిల్లులతో ఎలా షాక్ కొట్టించగలుగుతోందంటే.. అందుకు కారణం చంద్రబాబుగారు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడమే.

రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐని అనుమతించే విషయం మీద రాజ్యసభలో ఓటింగ్ జరిగినప్పుడు తన పార్టీ ఎంపీలను గైర్హాజరు చేయించి కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడి, చంద్రబాబుగారు చిన్న వర్తకులను, రైతులను ఎలా మోసం చేశాడో.. శాసన సభలో అవిశ్వాసం సమయంలో అలాగే రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబుగారు మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీతో అదే కుమ్మక్కును కొనసాగించటం ద్వారా తనమీద ఐఎంజీలోనూ, ఎమ్మార్లోనూ విచారణ జరగకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకునేందుకు చంద్రబాబునాయుడుగారు అసెంబ్లీలో అవిశ్వాసం సమయంలో ఏకంగా పేదవాడి ప్రయోజనాలను అమ్మేయటం వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు తెగించింది. అడ్డదిడ్డంగా కరెంటు చార్జీలను పెంచగలిగింది. ఇటువంటి కుమ్మక్కు రాజకీయాలకు, ఇలాంటి నీతిమాలిన రాజకీయాలకు స్వస్తి పలికి నిజాయితీతో కూడిన రాజకీయాలు ముందుకు రావాలని ఆంకాంక్షస్తూ.. పేదల తరఫున నిలబడి వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మేం మద్దతునిచ్చాం. ఇది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే.

ఇప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల వ్యూహం ఏమిటంటే.. మమ్మల్ని మా శాసన సభ్యత్వానికి అనర్హుల్ని చేయాలి. కానీ, ఎన్నికలు రాకూడదు! ఎన్నికలు వస్తే అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఓటమిని రాష్ట్ర ప్రజలంతా హర్షిస్తారు కాబట్టి.. రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తెలుగుదేశంతో వారి కుమ్మక్కు రాజకీయాలకు వ్యతిరేకంగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు కాబట్ట.. ఈ పార్టీలు నీతిమాలిన డ్రామాలకు తెరలేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు వరకూ అనర్హత ప్రకటించకపోతే, ఇక ఎన్నికలు నిర్వహించనక్కర్లేదన్నది ప్రజల్లో లేని ఈ రెండు పార్టీల దురాలోచన.

ఈ ప్రజలందరి సాక్షిగా, శాసన సభ సాక్షిగా మా పార్టీలవారితో విభేదించాం. ప్రజల తరఫున పోరాడుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేయి కలిపాం. మా శాసన సభ్యత్వాలను తక్షణం వదులుకునేందుకు సిద్ధపడ్డాం. అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయం మాకు జుగుప్స కలిగిస్తోంది. మా శాసన సభ్యత్వాలు పోవాలి కానీ, మళ్ళీ ఎన్నికలు జరగరాదన్న కుట్రపూరిత రాజకీయ వ్యూహాన్ని కాంగ్రెస్, తెలుగుదేశం అమలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాం. మా శాసన సభ్యత్వాల రద్దును తక్షణం ప్రకటించటంతోపాటు తద్వారా ఖాళీ ఏర్పడే ఎమ్మెల్యే స్థానాలను నోటిఫై చేయాలని కోరుతున్నాం. ఆ శాసన సభ స్థానాలకు సెక్షన్-151(ఎ) ప్రకారం ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికలు జరిపేందుకు మార్గం సుగమం చేయాలని కోరుతున్నాం.

రాష్ట్ర ప్రజల శ్రేయస్సును ఆంకాంక్షిస్తూ..
వైయస్ఆర్ అభిమాన శాసన సభ్యులు

తాజా ఫోటోలు

Back to Top