కోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన టీడీపీ

రోజాను సభలోకి అనుమతించకపోవడాన్ని..
కోర్టు దృష్టికి తీసుకెళ్లిన రోజా తరపు న్యాయవాదులు
ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం
కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం ధిక్కరించడం..
రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్న న్యాయనిపుణులు

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించకపోవడాన్ని రోజా తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని తప్పుబట్టారు. కోర్టు ధిక్కారం కింద పరిగణించాలని న్యాయవాదులు న్యాయస్థానానికి విన్నవించారు . నిబంధనలకు విరుద్ధంగా రోజాను సస్పెండ్ చేశారంటూ సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం అసెంబ్లీకి లేదని స్పష్టం చేశాయి. రోజా అసెంబ్లీకి వెళ్లొచ్చని కోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఆ ఉత్తర్వుల కాపీని రోజా అసెంబ్లీ కార్యదర్శికి కూడా అందజేశారు. ఐనా సరే రోజాను సభకు రానీయకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఖరిని న్యాయనిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం రాజ్యాంగాన్ని  ఉల్లంఘించడమేనని అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ప్రతి ఒక్కరూ నొక్కి వక్కానిస్తున్నారు. 

ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించకపోవడం పూర్తిగా కోర్టు తీర్పులను ఉల్లంఘించడమేనని ప్రముఖ న్యాయవాది రవిచంద్ర అభిప్రాయపడ్డారు. ఈ కేసులో తీర్పు వచ్చేముందే సుప్రీంకోర్టు అసలు ఈ దేశంలో ఏం జరుగుతోందని ప్రశ్నించిందని గుర్తుచేశారు. రోజా సస్పెన్షన్   చట్టానికి, న్యాయానికి విరుద్ధమైన పని అని, కోర్టు ఆమెను సభలోకి అనుమతించాలని చెప్పినప్పుడు గౌరవించాలని అన్నారు. కానీ దాన్ని స్వీకరించకుండా లోపలకు ఆమెను అనుమతించేది లేదంటే.. అది న్యాయాన్ని గౌరవించే ప్రజాప్రతినిధి చేయాల్సిన పని కాదని, చట్టం గురించి ఏమాత్రం తెలియనివాళ్లు, సామాన్యులు చేశారంటే పోనీలే పాపం అనుకోవచ్చని ఆయన చెప్పారు.

నిజానికి ప్రజాప్రతినిధులను చూసి రాబోయే తరాలు నేర్చుకునేలా ఉండాలని, అంతే తప్ప వాళ్లకు వాళ్లే నిర్దేశించుకోవడం కుదరదని అన్నారు. తీర్పు వారికి నచ్చకపోతే అప్పీలు చేసుకోవచ్చు గానీ ఇలా ప్రవర్తించకూడదని తెలిపారు. ఇది మొదటిసారి కాదని, ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఉందని అన్నారు. శాసనసభ చేసిన చట్టాలను కూడా న్యాయవ్యవస్థ సమీక్షించవచ్చని, దాన్ని శాసన సంస్థలు కాదనడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు.
Back to Top