విగ్రహాల్లో కాదు.. జనం గుండెల్లో ఉన్నారు

షాద్‌నగర్:

గ్రామాల్లో దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ విగ్రహాలను చూసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చెప్పారు. వైయస్ఆర్ విగ్రహాల గురించి చులకనగా మాట్లాడుతున్నారన్నారు. ప్రజలు మహానేతను విగ్రహాల రూపంలో పల్లెల్లో కాదనీ, తమ గుండెల్లో పెట్టుకున్నారనీ ఈ విషయాన్ని చంద్రబాబు  తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రజా సమస్యలు పట్టని రాష్ట్ర సర్కారు, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 51వ రోజు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో సాగింది. కేసంపేట మండల కేంద్రంలో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజలు వైయస్ఆర్ విగ్రహాలను ఎందుకు పెట్టుకుంటున్నారో చంద్రబాబునాయుడుకు ఇంకా తెలిసి రావడం లేదన్నారు. 'చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పరిపాలనలో గ్రామాలను శ్మశానాలుగా మారిస్తే.. కొన ఊపిరితో ఉన్న ఆ పల్లెలకు మహానతే ఊపిరి పోశారన్నారు. వైయస్ఆర్ విగ్రహాన్ని చూసినప్పుడు రైతులకు ఉచిత విద్యుత్తు గుర్తుకొస్తుంది. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు పథకం జ్ఞప్తికొస్తుంది. మహిళలకు ఆత్మ గౌరవంగా బతకడం కోసం రాజన్న ఇచ్చిన పావలా వడ్డీ పథకం మదిలో మెదులుతుంది.' అని వివరించారు. అవే పల్లెల్లో ఎన్టీఆర్ విగ్రహలు కూడా అక్కడక్కడా కన్పిస్తాయన్నారు. వాటిని  చూసినప్పుడు మాత్రం పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు గుర్తుకొస్తాడని ఆమె స్పష్టంచేశారు.  వైశ్రాయి హోటల్లో ఎమ్మెల్యేలను బంధించి డబ్బు పంచి అధికారం లాక్కున్న విషయం, ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబు, సంతోషంగా ఉన్న ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురిచేసి ఆయన మరణానికి కారణమైన విషయాలు జ్ఞప్తికి వస్తాయని’ తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top