'విద్యుత్‌'పై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ క్షేత్ర పరిశీలన

హైదరాబాద్, 26 మార్చి 2013: రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్‌ కష్టాలపై వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి కళ్ళకు కట్టినట్లు చూపించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. విద్యుత్‌ కోతల కారణంగా రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోలేదంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ క్షేత్ర స్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని భావించిందని పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో తెలిపారు.

క్షేత్ర పరిశీలనలో భాగంగా ప్రధానంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం పీలేరు, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ నియోజకవర్గం అందోల్, స్పీకర్‌ నాదెండ్ల మనోహర్ నియోజకవర్గం తెనాలి, డిప్యూటీ స్పీక‌ర్‌ మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలలో‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం పర్యటిస్తుందని కాపు‌ రామచంద్రారెడ్డి చెప్పారు. పర్యటన సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లోని పంటలు ఎండిపోయి, ప్రజలు ఎలాంటి కష్టనష్టాలు ఎదుర్కొటున్నారో ప్రభుత్వానికి ప్రత్యక్షంగా చూపిస్తామని కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఒక ప్రణాళికను వారు రూపొందిస్తున్నారు. ఒక వారం రోజుల లోపలే పార్టీ ఎమ్మెల్యేల బృందం క్షేత్ర స్థాయి పరిశీలనకు బయలుదేరాలని ఏర్పాట్లు చేస్తున్నారు.

పార్టీ ఎమ్మెల్యేంతా ఈ క్షేత్ర పరిశీలన కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఇందిరమ్మబాట పేరుతో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్ప... ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలని ఆలోచించడం లేదని రామచంద్రారెడ్డి విమర్శించారు. క్షేత్ర పరిశీలనలో భాగంగా విద్యుత్‌ ఇబ్బందులపై అటు ప్రభుత్వానికి, యావత్‌ రాష్ట్ర ప్రజలకు వాస్తవ పరిస్థితులను వెల్లడించడానికి తామంతా ప్రయత్నం చేస్తామని కాపు చెప్పారు.
Back to Top