'విచారణ' ఉండదు.. 'అవిశ్వాసం' ఉండదు!

కర్నూలు 21 నవంబర్ 2012 : అవినీతి ఆరోపణలపై విచారణ జరుపనందుకు ప్రతిఫలంగా చంద్రబాబు ప్రభుత్వంపై 'అవిశ్వాసం' పెట్టకుండా కాపాడుతు న్నారని షర్మిల అన్నారు. ఒక్కరోజు కూడా ఈ తుగ్లక్ ప్రభుత్వం అధికారంలో ఉండడానికి వీల్లేదని ఊరకే చెబుతూ తిరగడం తప్పించి 'అవిశ్వాసం' పెట్టరని ఆమె విమర్శించారు. అవిశ్వాసం పెడతారా లేదా అని నిలదీస్తున్నా ఏమీ చెప్పడని ఆమె చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 35వ రోజు పాదయాత్రలో భాగంగా బుధవారం కర్నూలు చెన్నమ్మసర్కిల్ వద్ద జరిగిన ఒక భారీ బహిరంగసభలో షర్మిల ప్రసంగించారు. జగనన్న ధైర్యమల్లా ప్రజాభిమానమేననీ, అది ఉన్నంతకాలం జగనన్నకు ఏ భయమూ లేదనీ ఆమె అన్నారు.
షర్మిల మాటల్లోనే...
"చంద్రబాబు కూడా పాదయాత్ర చేస్తున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు పడుతున్న కష్టాలేమిటో ఆయనకు అడుగడుగునా అర్థమౌతోంది. పేరుకు మటుకు చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తిరుగుతున్నాడు. ఇది తుగ్లక్ పరిపాలన అనీ, ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే అర్హత ఈ ప్రభుత్వానికి లేదనీ ఆయన చెబుతున్నాడు. కానీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'అవిశ్వాసం' పెడతారా లేదా చెప్పమంటే మటుకు ఏమీ చెప్పడు. 'అవిశ్వాసం' పెట్టరట. చంద్రబాబు మాటలకీ చేతలకీ ఎప్పుడూ పొంతన ఉండదు. చంద్రబాబు నాయుడు ఏ మాత్రం చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్నా'అవిశ్వాసం' పెట్టాలని ఎంత మంది కోరినా పెట్టడట. ఇందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీవారు  చంద్రబాబుకు వ్యతిరేకంగా  ఎన్ని ఆరోపణలున్నా ఒక్క ఎంక్వైరీ అయినా ఉండదు. ఒక్క కేసైనా పెట్టరు. ప్రతిఫలంగా చంద్రబాబు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'అవిశ్వాసం' పెట్టరు."అని ఆమె విమర్శించారు.
"కాంగ్రెస్, టిడిపి కలిసి ఇలా నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. వారి టార్గెట్ ఒక్కటే. అది జగన్...
జగనన్నబయటే ఉండి, ప్రజల సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉంటే ఇక కాంగ్రెస్‌కీ టిడిపికీ మనుగడ ఉండదనీ, ఆ రెండు పార్టీలూ దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందనీ కుట్రలు పన్ని జగనన్నను ఏ ఆధారాలూ లేకుండా అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని వాడుకుని జైలుపాలు చేయడం జరిగింది. కానీ జగనన్న ధైర్యం ఒక్కటే. అది మీరే. మీ గుండెల్లో అభిమానం ఉంది. ఎంత మంది కాంగ్రె,స్ నాయకులు రాజశేఖర్ రెడ్డిగారి వల్ల లబ్ధి పొంది, రాజశేఖర్ రెడ్డిగారి కుటుంబాన్ని గాలికొదిలేసినా మీరు మటుకు గుండెల్లో పెట్టుకున్నారు. మీరిచ్చే ధైర్యమే జగనన్న ధైర్యం. మీ గుండెల్లో అభిమానం ఉన్నంతకాలం జగనన్నకు ఏ భయమూ లేదు."అని ఆమె  ధీమాగా అన్నారు.
"జగనన్నను దేవుడే త్వరలో బయటకు తీసుకువస్తాడు. ఆ రోజున జగనన్న మనందర్నీ 'రాజన్నరాజ్యం' స్థాపించే దిశగా నడిపిస్తాడు. సమయం వచ్చినప్పుడు మీరు కాంగ్రె,స్, టిడిపిలకు బుద్ధి చెప్పినప్పుడు రాజన్నరాజ్యం కూడా వస్తుంది. 'రాజన్నరాజ్యం' వచ్చాక రాజన్న ఇచ్చిన ప్రతిమాటా జగనన్న నిలబెడతాడు. రాజన్న ప్రతికలనూ నెరవేరుస్తాడు. కోటి ఎకరాలకు నీరివ్వాలన్న రాజన్న కల నెరవేరుతుంది. మన రాష్ట్రంలో గుడెసె అన్నదే లేకుండా ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలన్న రాజన్న కల నెరవేరుతుంది. మన పిల్లలు పెద్ద చదువులు చదువులు చదువుకోవాలన్న కలా నెరవేరుతుంది. ప్రతిరైతూ తన పంటను లాభానికే అమ్ముకునేటట్టు మూడువేల కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఏర్పడుతుంది. మహిళలకూ, రైతులకూ వడ్డీ లేకుండానే రుణాలిస్తారు. మన వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ రూ.200 నుంచి రూ.700 అవుతుంది. మన వికలాంగులకు పెన్శన్ రూ. 1000 అవుతుంది. 'అమ్మఒడి' పథకం కింద ఇద్దరు పిల్లలను చదివించుకోవడానికి ఒక్కో పిల్లాడికి నెలకు రూ.500 చొప్పున పైకం అమ్మ అకౌంట్‌లోనే పడుతుంది. ఇంటర్ అయితే రూ.700, డిగ్రీ అయితే రూ.1000 ఇస్తారు. చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న మనిషి కనుక రాజశేఖర్ రెడ్డిగారు చెప్పినవీ చేశాడు. చెప్పనివీ చేశాడు. జగనన్న కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. చెప్పనివీ కూడా ఎన్నో చేస్తాడు. మీరంతా జగనన్నను ఆశీర్వదించాలనీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలనీ, కుట్ర రాజకీయాలకు నిరసనగా నల్లబ్యాడ్జీలు పెట్టుకుని మాతో పాటు కదం తొక్కాలని మా ప్రార్థన" అని షర్మిల కోరారు.

Back to Top