వీలున్నా అవిశ్వాసం పెట్టరేం!

లత్తవరం(ఉరవకొండ):

జగనన్న గెలుస్తారనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల చెప్పారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో శనివారం మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబుకు అవకాశం ఉన్నప్పటికీ కిరణ్ సర్కారుపై అవిశ్వాసాన్ని పెట్టరనీ, దానికి ప్రతిఫలంగా సర్కారు ఆయనపై సీబీఐ విచారణకు ఆదేశించదనీ వివరించారు. ఇది వారిద్దరి మధ్య కుదిరిన ఒప్పందమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్షం ప్రభుత్వాన్ని కనీసం ఇదేంటని ప్రశ్నించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం ఇంతకంటే ఏం కావాలని ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్‌, టీడీపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాజన్నరాజ్యం వచ్చిన రోజున కోటి ఎకరాలకు నీరు అందుతుందని, మహిళలకు వడ్డీలేని రుణాలు వస్తాయనీ షర్మిల భరోసా ఇచ్చారు. దేవుడున్నాడనీ, జగనన్నని బయటకు తీసుకొస్తాడనీ పేర్కొన్నారు. ఆమె వెంట షర్మిల కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి కూడా శనివారం పాదయాత్రలో పాల్గొన్నారు.

Back to Top