పిచ్చి కూతలు, రాతలు ఆపండి: వాసిరెడ్డి

హైదరాబాద్:

టైటానియం కేసులో టీడీపీ పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నదని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి తోక పత్రికల్లో వచ్చిన డొంక తిరుగుడు కథనాలను పట్టుకుని టీడీపీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

‌‘టైటానియం ఖనిజం కేసుతో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని సాక్షి పత్రిక బహిరంగ సవాల్ విసిరింది.‌ నిరూపిస్తే ఈనాడుకు తమ పత్రికను ధారాదత్తం చేస్తామని, నిరూపించకపోతే ఈనాడును వదిలేస్తారా? అని సవాల్ విసిరినా మౌనంగా ఉండిపోయారు. సవాల్‌కు స్పందించకుండా తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరించారు. నిస్సిగ్గుగా మళ్లీ అనేక కథనాలు రాస్తున్నారు. ఆ కథనాలు పట్టుకుని శ్రీ జగన్మోహన్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయంటూ టీడీపీ నాయకులు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు’ అని దుయ్యబట్టారు.

ఇకనైనా పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. వైయస్ఆర్‌సీపీ కార్యాలయానికి కళ్లు లేవా అని చెబుతున్న టీడీపీ నేత సోమిరెడ్డికి కళ్లు మూసుకుపోయాయని ఆమె ధ్వజమెత్తారు. ‘శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేతలు ఎన్నోరకాలుగా కుట్రపన్నుతున్నారు. 16 నెలలు జైల్లో పెట్టించినా.. మేం ఓపికతో ఉన్నాం.. చట్టాన్ని గౌరవించాం. కాబట్టే గత ఉప ఎన్నికల్లో ప్రజలు మావైపే నిలిచారు. ఇప్పుడు మీరు, మీ తోక పత్రికలు పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటే ఊరుకునేది లేదు. ప్రజలు అంతా గమనిస్తున్నారు’ అని పద్మ హెచ్చరించారు.

కాంగ్రెస్‌తో చంద్రబాబుకు డీల్:
చంద్రబాబు నాయుడిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సీబీఐ ఎందుకు దర్యాప్తు జరపడంలేదని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఐఎంజీ భూముల వ్యవహారంతో పాటు పలు అంశాలపై వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ  గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ పిటిషన్ వేస్తే ఎందుకు విచారణ జరపలేదని నిలదీశారు. కాంగ్రె‌స్ పార్టీతో డీ‌ల్ కుదుర్చుకోబట్టే విచారణ విషయం పక్కకుపోయిందన్నారు. దమ్ముంటే‌ శ్రీమతి విజయమ్మ వేసిన పిటిషన్‌పై నిలబడాలని, సీబీఐ విచారణను ఆహ్వానించాలని‌ పద్మ సవాల్ విసిరారు. కోర్టులను అడ్డం పెట్టుకుని కారుకూతలు కూస్తున్నారన్నారు.

చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలన, పదేళ్ల ప్రధాన ప్రతిపక్ష నేతగా పోషించిన సమయంలో ఆయన ఎక్కడెక్కడకు వెళ్లారో విచారించాలని‌ వాసిరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు పా‌స్‌పోర్టులు పరిశీలిస్తే బండారం బయట పడుతుందన్నారు. చంద్రబాబు తన అవినీతి చరిత్ర బయటపడకుండా కాపాడుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ కాళ్లు పట్టుకుంటున్నారని పద్మ ఎద్దేవా చేశారు. ప్రజల్లో శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొనలేమని తెలిసే ఇలాంటి చౌకబారు ట్రిక్కులు ప్రదర్శిస్తున్నారన్నారని పద్మ విమర్శించారు.

Back to Top