వంద సీట్లతో తెలంగాణ వస్తుందా?

హైదరాబాద్

9 నవంబర్ 2012 : కాంగ్రెస్ ఇక తెలంగాణ ఇవ్వదని తేల్చేసిన కేసీఆర్,
టిఆర్ఎస్ ద్వారా ప్రత్యేక రాష్ట్రం ఎట్లా సాధిస్తారో చెప్పా లని వైయస్ఆర్
సీపీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యురాలు కొండా సురేఖ నిలదీశారు. ఇకనైనా
మోసం చేయడం మాని తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె
కేసీఆర్‌కు రాసిన ఒక బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో
మాట్లాడుతూ ఆమె కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. 11 సంవత్సరాలుగా మోసం
చేస్తూ వచ్చిన కేసీఆర్ మళ్లీ 2014 ఎన్నికలు వస్తున్నందున ఓట్లూ సీట్లూ
పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
"టిఆర్ఎస్ మేధామథనం సదస్సులో
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చే ఉద్దేశ్యం లేదన్నారు. ఇప్పుడు మళ్లీ
ఉద్యమమంటున్నారు. ప్రతి ఎన్నికలో కూడా ఈ ఎన్నిక గెలిస్తే తెలంగాణ
వస్తుందంటూ వచ్చారు. నెలలోపే తెలంగాణ వస్తుందన్నారు. మళ్లీ ఇప్పుడు 100
సీట్లు అసెంబ్లీలో, 16 సీట్లు ఎంపీ సీట్లు గెలిపించాలంటున్నారు. ఈ సీట్లతో
తెలంగాణ ఎట్లా వస్తుంది?" అని ఆమె ప్రశ్నించారు.
"కాంగ్రెస్ తెలంగాణ
ఇవ్వదంటున్నారు. బిజెపినేమో మతతత్త్వపార్టీ అంటున్నారు. మరి కేంద్ర సహాయం
లేనిదే ఎలా 'తెలంగాణ' తేగలరు? నూటికి నూరు శాతం తెలంగాణ సీట్లు సాధించినా
కూడా తెలంగాణ ఎలా తేగలరో ప్రజలకు చెపితే నా ఓటు కూడా వేస్తానని గతంలోనే
చెప్పాను. నెల రోజులు ఢిల్లీలో ఉండి కూడా కనీసం 'అఖిలపక్ష సమావేశం' ఏర్పాటు
చేయించలేకపోయారు. లోలోపల కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఎన్ని కోట్లకు తెలంగాణ
ఉద్యమాన్ని తాకట్టు పెట్టారో చెప్పాలి" అని సురేఖ నిలదీశారు.
ఓట్ల
ద్వారా సీట్లు పెంచుకుని కోట్లు గడించడమే టిఆర్ఎస్ లక్ష్యమని ఆమె
దుయ్యబట్టారు. టిఆర్ఎస్ పెట్టినప్పుడు తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా
ముద్దాడతానన్నకేసీఆర్ బిజెపిని మతతత్త్వపార్టీ అనీ, కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ ఇవ్వదనీ, వైయస్ఆర్ పార్టీ సమైక్యవాదపార్టీ అనీ పలురకాలుగా
మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామంటూ
వైయస్ఆర్ సీపీ ప్లీనరీలోనే చెప్పిందనీ, ఉపఎన్నికల్లో అభ్యర్థులను కూడా
నిలబెట్టలేదనీ ఆమె గుర్తు చేశారు.
"జగన్ పార్లమెంటులో ప్లకార్డు
పట్టుకున్నారంటున్నారు. టిఆర్ఎస్ పెట్టక ముందు 610 జీఓను కేసీఆర్
అసెంబ్లీలోనే వ్యతిరేకించారే! అలాగే జగన్‌ కూడా పార్టీ పెట్టక ముందు అక్కడి
ప్రజల మనోభావాలను వ్యక్తం చేసి వుండవచ్చు. ఇప్పుడు పార్టీ పెట్టాక మీ
ఆలోచనలు మార్చుకున్నట్లే జగన్మోహన్ రెడ్డిగారు కూడా పార్టీ అధ్యక్షుడయ్యాక
వైయస్ఆర్ సీపీ ఆలోచనలు కూడా మార్చుకుంది" అని ఆమె వివరించారు.
"తెలంగాణ
తెస్తామని చెప్పి ఓట్లేయించుకున్నారు. కనుక ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు తప్పక గుణపాఠం చెబుతారు. మా
పార్టీ వల్ల తెలంగాణ రాదు, మేము తేలేము అని స్పష్టంగా చెప్పి ముక్కు నేలకు
రాయాలి. ఇకమైనా మోసం మానాలి"అని సురేఖ అన్నారు.

Back to Top