‘వంద’ కుట్రలపై ఒక్కడి విజయం

*ఫలించని అధికార, ప్రతిపక్షాల కుట్ర
*చావు దెబ్బతిన్న రెండు ప్రధాన పార్టీలు
*ఉప ఎన్నికల్లో తిరుగులేని తీర్పు ఇచ్చిన ప్రజలు
*జగన్ దిశా నిర్దేశంలో వైఎస్సార్ కాంగ్రెస్
*అనునిత్యం ప్రజా సమస్యలపై పోరు

ప్రజల నుంచి పుట్టిన నాయకుడిని ఆ ప్రజలకు దూరం చేయగలరా?..

అనునిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సమస్యలు వింటూ వాటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజా నాయకుడిగా ఎదిగిన జగన్‌ను జనం నుంచి దూరం చేయటానికి.. ప్రభుత్వం, ప్రతిపక్షం కుమ్మక్కయి ఒక్కడిపై పన్నిన కుట్రలు బెడిసికొట్టి ఆ పార్టీలనే నామరూపాల్లేకుండా చేశాయని.. జగన్‌కు పెరుగుతున్న జనాదరణ, దినదిన ప్రవర్థమానమవుతున్న పార్టీ, ఎన్నికల ఫలితాలు, సర్వేల అంచనాలు స్పష్టం చేయటం లేదా!! -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా అణగదొక్కడానికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా చేసిన కుయత్నాలు నెరవేరాయా? వారు అనుకున్నదేమిటి? జరిగిందేమిటి? వరుస ఎన్నికల్లో ప్రజలిస్తున్న తీర్పు... ప్రతిష్టాత్మక సంస్థలు చేస్తున్న సర్వేలు తెలియజేస్తున్నదేమిటి? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతుండడానికి కారణాలేమిటి? జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి వంద రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ జరిగిన పరిణామాలను పరికిద్దాం...

జగన్‌మోహన్‌రెడ్డిని ఎలాగైనాసరే లొంగదీసుకోవాలని ప్రయత్నించి భంగపడిన అధికార పార్టీ చివరకు సీబీఐని ఆయుధంగా చేసుకుని వేధించడం, అరెస్టు చేయించడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ప్రజలు గ్రహించారు. అందుకే ఆయన అరెస్టు తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారు. జగన్‌ను ప్రజలకు దూరం చేసినా వారు ఆయనకు దూరం కాలేదని, అరెస్టు చేసినా జగన్ ప్రభంజనం ఆగలేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో నామినేషన్ల ఉపసంహరణ (మే 25) తర్వాత మే 27న జగన్‌ను అరెస్టు చేశారు. జగన్‌ను ప్రచారంలో లేకుండా చేసినా ఆ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించడం చూస్తే ఆయన పట్ల ప్రజాభిమానం ఏ స్థాయిలో ఉందో రుజువయిందని పరిశీలకులు అంటున్నారు.
జగన్‌ను అరెస్టు చేయడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పూర్తిగా నీరుగారిపోతుందని, పార్టీ మూతపడుతుందనే గందరగోళంలో ఆ పార్టీ కార్యకర్తలను ముంచేయవచ్చని అధికారపార్టీ భావించింది. అంతేకాదు బయట నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వలసలను నిరోధించవచ్చని కూడా వారు భావించారు. కానీ ఇవేవీ నెరవేరలేదు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రజా మద్దతు పెరుగుతున్నదని ఉప ఎన్నికల ఫలితాలు, సర్వేలు తెలియజేస్తుండగా.. ఆ పార్టీలోకి వెళ్లే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఉప ఎన్నికలకు ముందు జగన్‌ను అరెస్టు చేయడం ద్వారా ఆయన గొంతు నొక్కేయవచ్చని, తద్వారా ఫలి తాలు తమకు అనుకూలంగా వస్తాయని కూడా అధికార పార్టీ ఆశించింది. కానీ ఫలితాలు చెంప ఛెళ్లుమనిపించాయి. జగన్‌ను అరెస్టు చేసిన 15 రోజుల తర్వాత పోలింగ్ జరిగినా ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారు.

చావుదెబ్బతిన్న ప్రధాన పార్టీలు...

జగన్ విషయంలో తాము చేసిన ‘అతి’ తమ కొంప ముంచిందని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స్థాయిలో ‘కృషి’ చేసినా ఏం సాధించలేకపోయామే అని కాంగ్రెస్ పెద్దలు మథనపడుతున్నారు. జగన్‌ను దెబ్బతీయడం కోసం అధికార పార్టీతో కుమ్మక్కయిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా చావుదెబ్బతిన్నది. కాంగ్రెస్‌తో పాటు టీడీపీ ఓటుబ్యాంకు కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌కు మరలిందని పరిశీలకుల అంచనా. ‘మా నాయకుడు ప్రజా సమస్యలు వదిలేసి జగన్‌మోహన్‌రెడ్డిపై దృష్టి నిలిపినందుకు ఫలితం అనుభవిస్తున్నాం.. జగన్‌కు నష్టం చేయాలని చూస్తే మా దుకాణమే ఖాళీ అయిపోతోంది’ అని టీడీపీ వర్గాలు ఇపుడు వాపోతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు అఖండ విజయం కట్టబెట్టిన ప్రజలు న్యాయం జగన్ పక్షానే ఉందని నిరూపించారు. అరెస్టు జరిగి 100 రోజులైనా జగన్‌పై జనాభిమానం ఏ మాత్రం తగ్గలేదని సర్వేలు రుజువు చేస్తున్నాయి.

జగన్, ఆయన పార్టీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారని, ప్రజాభిమానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 27 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని ఇండియా టుడే, నీల్సన్ సర్వే అంచనా వేసింది. ముఖ్యమంత్రిగా జగన్‌మోహనరెడ్డిని 48 శాతం ప్రజలు కోరుకుంటున్నారని ఎన్‌డీటీవీ సర్వేలో తేలింది. మిగిలిన మహామహా నాయకులెవరూ ఆయన దరిదాపుల్లో కూడా లేరు.

జనం మధ్య లేకున్నా సమస్యలపై పోరు...

అయితే జగన్‌ను అరెస్టు చేయించడం ద్వారా వారు ఒక్క విషయంలో విజయం సాధించారు. ఆయన్ను ప్రజలమధ్య లేకుం డా చేయగలిగారు. ప్రజల తరఫున ఆయన పోరాడే వీలు లేకుండా చేయగలిగారు. జగన్ బయట ఉంటే ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేసేవారు. అదొక్కటే వారికి ఊరట. జైలులో నిర్బంధించినా ప్రజల కష్టాలు, కడగండ్లపై ఎప్పటికప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూనే ఉన్నారని.. ఆయన అభీష్టం మేరకు, ఆయన ఆలోచనల మేరకు పార్టీ కార్యకలాపాలను నడిపిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. జగన్ బయట ఉంటే ప్రజల సమస్యలపై మరింత బలంగా తమ వాణిని వినిపించే అవకాశముండేదని వారంటున్నారు.

ప్రధాన ప్రతిపక్షంగా చూస్తున్నారు...

ప్రజా సమస్యలే ఎజెండాగా నడుస్తున్న పార్టీ కాబట్టే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నేడు ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా చూస్తున్నారని పార్టీలో ఈ మధ్యే చేరిన సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. నాయకుడి ఆలోచనలకు అనుగుణంగా నిజాయతీ గలిగిన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్నామని ఆయన వివరించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుండబట్టే తమ పార్టీకి ప్రజలు అండగా నిలబడుతున్నారని పేర్కొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో చేనేత కార్మికుల సమస్యలపై సిరిసిల్ల దీక్ష, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఏలూరు దీక్ష, కరెంట్ కష్టాలపై రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడాన్ని ఆయన సోదాహరణంగా వివరించారు. ఇవేకాదు ఈ నెల 6, 7 తేదీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై మరోమారు దీక్ష జరగబోతున్నదని పేర్కొన్నారు.

జగన్ జనంలో ఉంటే ఆమరణ దీక్ష చేసేవారు...

గడచిన మూడు నెలల్లో రాష్ట్రంలో జరిగిన పరిణామాలు చూస్తే.. రైతుల ఖరీఫ్ కష్టాలు.. విద్యార్థుల ఫీజు ఇక్కట్లు.. విధానపరమైన లోపాలతో భావి ఇంజనీర్ల అవస్థలు.. కనీవినీ ఎరుగని రీతిలో కరెంటు కోతలతో మూతపడుతున్న పరిశ్రమలు.. రోడ్డునపడుతున్న కార్మికులు, కరెంటుతో ముడిపడిన రోజువారీ బతుకులు ఛిద్రమవుతుండడం.. మొత్తంగా స్తంభించిపోతున్నజనజీవనం... ఇన్ని జరుగుతున్నా నిమ్మకునీరెత్తినట్లున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్థూలంగా ఇదీ పరిస్థితి! ఏం జరుగుతున్నా ప్రశ్నించేవారే లేరు. ప్రభుత్వాన్ని ప్రజలు ఛీకొడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం తూతూ మంత్రంగా ఆందోళనలు చేస్తున్నా వాటిలో సీరియస్‌నెస్ లేదన్న విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపు లేమికి కరెంటు అవస్థలు ప్రత్యక్ష నిదర్శనమని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇంతటి దుర్భర పరిస్థితి తలెత్తలేదు. కరెంటు కోతల కారణంగా చిన్న పరిశ్రమలు పూర్తిగా స్తంభించిపోయాయి. వేలాది మంది కార్మికులకు ఉపాధి పోయింది. రోజు కూలీకి పనిచేసే లక్షలాది మంది జీవితాలు రోడ్డునపడ్డాయి. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. రైతులకు తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందించాలంటూ గతంలో ‘కరెంటు పోరు’ సాగించిన జగన్‌మోహన్‌రెడ్డి బయట ఉండివుంటే.. ఇపుడు కరెంటు కష్టాలపై ఆమరణ దీక్షకు దిగేవారేమోనని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒకరు అంటున్నారు.

Back to Top