విద్యార్థుల‌కు విలువలతో కూడిన విద్య అందించాలి

చీపురుపల్లి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ ఉపాధ్యాయులకు సూచించారు. పట్టణంలోని హడ్కోకాలనీలో గల శ్రీ రామానుజన్ ట్యూషన్ సెంట‌ర్‌కు చెందిన 22 మంది విద్యార్థులు ఇంటర్నేషనల్ మాస్టర్స్ మ్యాథ‌మెటిక్స్‌ ఒలింపియాడ్(ఐఎమ్ఎమ్ఓ), ఇంటర్నేషనల్ సైన్స్ ఒలింపియాడ్(ఐఎస్ఓ) ప్రతిభా పరీక్షల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించారు. దీంతో ట్యూష‌న్ సెంట‌ర్ విద్యార్థుల‌కు అభినంద‌న‌లు తెలుపుతూ స‌మావేశం ఏర్పాటు చేసింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బెల్లాన చంద్రశేఖర్ ప్రతిభా పరీక్షల్లో బంగారు పతకాలు సాధించిన 14 మందికి, వెండి పతకాలు సాధించిన 8 మంది విద్యార్థుల‌కు పతకాలతో పాటుగా ధృవీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా నిర్వహించే ఐఎమ్ఎమ్ఓ, ఐఎస్ఓ ప్రతిభా పరీక్షల్లో దాదాపు 60 వేల మంది వరకు పాల్గొనగా అందులో హడ్కోకాలనీ శ్రీ రామానుజన్ ట్యూషన్ సెంటర్‌లో చదువుతున్న 22 మంది విద్యార్థులకు పతకాలు రావడం ఎంతో గొప్ప విషయమని చెప్పారు. ఎంతో వెనుకపడిన ఈ ప్రాంతంలో ఉంటున్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు ఇంటర్నేషనల్ స్థాయిలో తీర్చిదిద్దాలని ఉపాధ్యాయుల‌కు సూచించారు. విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయాల‌న్నారు. అందులో భాగంగానే ప్రయోగాత్మక బోధనతో పాటు విద్యార్థులకు విలువలతో కూడిన విద్య‌ను అందించాల‌న్నారు.  కార్యక్రమంలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు ఇప్పిలి అనంతం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 
Back to Top