నిర్మల్ (ఆదిలాబాద్ జిల్లా) : మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఈ మూడేళ్ళలోనూ రాష్ట్ర ప్రజలకు తీవ్ర వేదనే మిగిలిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని గోవర్ధన్ తెలిపారు. తెలంగాణపై కాంగ్రెస్, టిడిపి, టిఆర్ఎస్ పార్టీలు అవలంబిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడొస్తుంది, రేపు వస్తుందని తెలంగాణపై వాయిదా ప్రకటనలు చేసే వారిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి చంద్రబాబునాయుడు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
మాజీ ఎంపి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం వైయస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో చేరనున్న సందర్భంగా నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందకు బాజిరెడ్డి ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న పాదయాత్రకు తెలంగాణ ప్రజలు విశేష స్వాగతం పలుకుతున్నారని, విజయమ్మ రాత్రింబవళ్లు కష్టపడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తున్నారని బాజిరెడ్డి వివరించారు. అందుకే టిడిపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు తెలంగాణ నాయకులు వైయస్‌ఆర్ సిపి వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. అన్ని ప్రాంతాల నుంచీ పెద్ద ఎత్తున చేరుతున్నారని స్పష్టం చేశారు.
వైయస్‌ఆర్‌సిపి అధికారంలోకి వస్తేనే పంటలు పండక అన్నదాతలు పడుతున్న బాధలన్నీ తీరుతాయని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలవడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై వైయస్‌ఆర్ సిపి అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టారని వైయస్‌ఆర్‌సిపి జిల్లా కన్వీనర్ బోడ జనార్ధన్ పేర్కొన్నారు. శ్రీ జగన్‌కు బెయిల్ రాకుండా చేస్తున్న వారి దుశ్చర్యలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. కాంగ్రెస్, టిడిపిలపై తిరుగుబాటు మొదలైందని జనార్దన్ పేర్కొన్నారు. ప్రజా తిరుగుబాటులో భాగంగానే విజయమ్మ సమక్షంలో వేలాది మంది పార్టీలో చేరుతున్నారన్నారు.