మహానేత వైయస్ ధరించినవి చేనేత బట్టలే!

ఉరవకొండ

3 నవంబర్ 2012 : ఉరవకొండ చేనేతన్నల ప్రాంతం కావడాన శనివారం జరిగిన సభలో విజయమ్మ మాట్లాడుతూ నాడు వైయస్ నేతబట్టలే కట్టేవారన్న విషయం గుర్తు చేశారు. "రాజశేఖర్ రెడ్డిగారు కట్టుకున్నవి నేతబట్టలే. తెల్లని రంగులోని నేతన్న బట్టలే వేసుకునేవారు. ఆఫీసర్లు కూడా వారానికి ఒకసారి నేతబట్టలే వేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పిల్లలకు కూడా నాలుగు జతల బట్టలు కొనుగోలు చేయాలన్నారు. అంతో ఇంతో ఎన్టీఆర్ చేశారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డిగానే చేనేతన్నలకు సాయం చేశారు. ఇప్పుడు చేనేతకార్మికుల కోసం ఆలోచించే ఒకే ఒక వ్యక్తి జగన్‌బాబు. ధర్మవరంలో జగన్ బాబు ధర్నా చేశారు. ప్రభుత్వమే నూలు సరఫరా చేస్తుందని, రుణమాఫీ చేస్తానని, వడ్డీ లేని రుణాలు ఇస్తామని, మగ్గాలకు షెడ్లు కట్టించి ఇస్తామనీ జగన్ వాగ్దానం ఇవ్వడం జరిగింది" అని ఆమె గుర్తు చేశారు.
"అప్పట్లో పదివేలకు పైగా నేతమగ్గాలుండేవట. ఇప్పుడు రెండు వేలకి తగ్గినాయట. రూ.1600 చీరను రూ.1400లకే అమ్మాల్సిన స్థితి రావడం బాధాకరం." అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండువందల శాతానికి పైగా ముడిసరుకుధరలు పెరగడంతో నేతన్నల పరిస్థితి దిగజారిందని ఆమె అన్నారు.
"అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. చేనేతన్నల రుణమాఫీ కోసం బడ్జెట్‌లో రూ. 312 కోట్లు పెట్టారు. కానీ ఇంతదాకా అది అమలు కావడం లేదు. నేతన్నలకు వైయస్ 50 ఏళ్లకే పెన్షన్లు ఇచ్చారు. పెన్షను రూ.75 నుండి రూ.200 చేశారు. ఆప్కో టర్నోవర్‌ను రూ.32 కోట్ల నుండి రూ.250 కోట్లకు చేర్చారు." అని విజయమ్మ చెప్పారు.
 రాజశేఖర్ రెడ్డిగారు 80 వేల ఎకరాలకు నీరు అందించే విధంగా హంద్రీ-నీవా సుజల స్రవంతిని 40 టిఎంసిలకు పెంచారని ఆమె గుర్తు చేశారు. "95 శాతం పూర్తి అయింది. కానీ మిగిలిన పనులు మూడేళ్లైనా జరగలేదు. హెచ్ఎల్సీ ఆధునికీకరణ పనులు కూడా నత్తనడక నడుస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డిగారు వెళ్లిపోయాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా తయారైంది. అనంతపురం చాలా కరువు ప్రాంతమని ఆనాడు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని పంటల బీమా ఇచ్చారు. ఒక్క సంవత్సరంలోనే రూ.645 కోట్లు బీమా కింద చెల్లించారు. ఆయన మన మధ్య నుండి వెళ్లిపోయాక వాతావరణం ప్రాతిపదికన బీమా పథకం పెట్టారు. దీంతో మనం కట్టిన బీమీ ప్రీమియం కూడా రాని పరిస్థితి ఉంది." అని విజయమ్మ ఆవేదనగా అన్నారు.

Back to Top