వైయస్ అభిమానుల సభ్యత్వాల రద్దుకు యత్నం

కుందుర్పి: సహకార సంఘాల ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు నాయకులు కంకణబద్ధులు కావాలని ఆ పార్టీ జిల్లా నాయకులు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కుందుర్పి, కంబదూరుల్లోని పార్టీ కార్యాలయాల్లో సహకార ఎన్నికల్లో బలం చాటేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సభ్యత్వ నమోదు తదితర కార్యక్రమాలపై మండల నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. సహకార సంఘాల్లో వైయస్ అభిమానుల సభ్యత్వాలను రద్దుచేసేందుకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒక్కో మండలానికి రూ.5 నుంచిరూ.10లక్షల వరకు నిధులను తరలించి, అధికారులను ఇళ్లవద్దకే పిలిపించుకుని వందలాది మంది అనర్హులకు అక్రమంగా సభ్యత్వాలు ఇప్పిస్తున్నారని విమర్శించారు. మహానేత వైయస్ రైతు సమస్యల పరిష్కారానికి అధిక సమయం కేటాయించి, వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ప్రోత్సాహక రుణాల కింద రూ.18 కోట్లు నిధులు విడుదల చేసి జిల్లా రైతులకు పెద్దపీట వేశారన్నారు. సహకార ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి ఎక్కువ మంది డెరైక్టర్లను గెలిపించుకునేందుకు కృషి చేయాలన్నారు.

తాజా ఫోటోలు

Back to Top