మహబూబ్‌నగర్: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న అశేష ప్రభంజనాన్ని చూసిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి గుండెల్లో దడ పుట్టిందని వైయస్‌ఆర్ సిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. తమ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు మహిళలు, వృద్ధులు, రైతులు, యువకులు, విద్యార్థులు, వికలాంగులు అన్ని వర్గాల నుంచి ఎనలేని ఆదరణ లభిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగినది అని అభివర్ణించారు. ఎస్సీ, ఎస్సీ సబ్ ప్లాన్ ఓటింగ్ విషయంలో కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల భయంతోనే కిరణ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను తీసుకువచ్చిందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రాయలసీమలోను, అనేక సందర్భాల్లో ప్రజల మధ్యకు పాదయాత్రగా వెళ్ళిన వ్యక్తి అని కొనియాడారు. శ్రీమతి షర్మిల పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనను చూసి, జనంలోకి వెళ్ళకపోతే కనీస గుర్తింపు కూడా ఉండదన్న భయంతోనే చంద్రబాబు కూడా పాదయాత్ర చేస్తున్నారన్నారు. అయితే, చంద్రబాబు పాదయాత్రకు ప్రజల నుంచి కనీస స్పందన కూడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎప్పుడూ హెలికాప్లర్లు, ఎసి కార్లలో తిరిగే చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ పాదయాత్ర చేసిన దాఖలా లేదన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు భయపడే చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారన్నారు. ఇప్పుడు చంద్రబాబు జనం మధ్యకు వచ్చి కొత్త కొత్త వాగ్దానాలు ఇస్తున్నారని, కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, వాటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.26 జీఓలపై మంత్రులు రకరకాలుగా మాట్లాడడాన్ని అంబటి తప్పుపట్టారు. ఆ మంత్రులు 26 జీఓలు చట్టబద్ధంగా విడుదల చేశామని, వాటిలో ఎలాంటి తప్పిదాలూ లేవని చెబుతూనే వారు శ్రీ జగన్మోహన్‌రెడ్డి వీటిని ఉపయోగించుకుని డబ్బు సంపాదించుకున్నారని వారు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆ ఐదుగురు మంత్రులు చేస్తున్న వాదనలు నిజమే అయితే, మంత్రివర్గ నిర్ణయాలు న్యాయబద్ధమైనవే అయినప్పుడు, చట్టబద్ధమైనవి అయినప్పుడు జగన్మోహన్‌రెడ్డి అసలు దోషే కాదన్నారు.