వైయస్‌ఆర్‌సిపికి అరుదైన గౌరవం: అంబటి

హైదరాబాద్, 11 మార్చి 2013: ఆవిర్భవించిన రెండేళ్ళలోనే తమ పార్టీని బలీయమైన శక్తిగా ఆదరించిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ సమక్షంలో మంగళవారంనాడు రెండవ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో అంబటి సోమవారంనాడు మీడియాతో మాట్లాడారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాల స్ఫూర్తితో ప్రజా సంక్షేమమే పరమావధిగా శ్రీ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి స్థాపించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళవారంతో రెండేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైయస్‌ రాజశేఖరరెడ్డి సమాధి సాక్షిగా శ్రీ జగన్‌ రెండేళ్ల క్రితం (12-03-2011) ఇదే రోజున తన తల్లి శ్రీమతి వైయస్‌ విజయమ్మతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించడంతో రాష్ట్ర రాజకీయ యవనికపై పార్టీ ఆవిర్భవించింది. అంతకు ముందు రోజు (11.03.2011) తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో అశేష జనవాహిని సమక్షంలో పార్టీ పేరు ‘వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు.

రెండేళ్ళ క్రితం శ్రీ వైయస్‌ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా ఎదిగిందన్నారు. ఈ కొద్ది కాలంలోనే పార్టీ ఎంతగానో ప్రజాదరణ పొందిందని అంబటి చెప్పారు. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరిని ఎంపీలుగా గెలిపించిన రాష్ట్ర్ర ప్రజలు తమ పార్టీని ఎంతగానో ఆదరించారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 200 స్థానాల్లో గెలుచుకుని మూడవ వ్యవస్థాపక దినోత్సవం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దానితో పాటు ఇప్పుడు ఇద్దరు ఉన్న ఎంపీల బలాన్ని 30 పెంచుకుంటామని ఆయన అన్నారు.

పార్టీ ఆవిర్భవించిన ఈ రెండేళ్ళలో ఏ ఎన్నికలలో పోటీ చేసినా ఘన విజయాలు సాధించిందని అంబటి పేర్కొన్నారు. ఏర్పాటు చేసిన రెండు నెలల్లోనే పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి‌ 5,45,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన వైనాన్ని గుర్తుచేశారు. ఇది భారతదేశ పార్లమెంటరీ చరిత్రలోనే అరుదైన మెజారిటీ అన్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ పులివెందుల అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి 85 వేల పైచిలుకు మెజారిటీతో ఘన విజయం సాధించారన్నారు. ఆ తరువాత 16 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలను కోల్పోయినప్పుడు జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలిచారన్నారు. చిరంజీవి రాజీనామా చేసిన తిరుపతి అసెంబ్లీ సీటులో వైయస్‌ఆర్‌సిపి అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలిచిన విషయం గుర్తుచేశారు. ఏర్పాటైన రెండేళ్ళలో ఒక పార్టీ ఇంతగా ఆదరణ పొందడాన్ని అరుదైన గౌరవంగా తాము భావిస్తున్నామన్నారు.
Back to Top