వైయస్‌ఆర్‌సిపి అభ్యర్థులకు పెద్దిరెడ్డి మద్దతు

చిత్తూరు : మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే రైతుల‌ బాగోగులను ఎంతో బాగా చూసుకున్నారని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తొమ్మిదేళ్ళ చంద్రబాబు హయాంలోనూ, రెండేళ్ల కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలోనూ రైతులకు ఎలాంటి మేలూ జరగలేదని ఆయన విమర్శించారు. సహకార ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం సత్యవేడు నియోజకవర్గంలో పర్యటించారు. ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌సిపి కార్యకర్తల సమావేశాల్లో పెద్దిరెడ్డి మాట్లాడారు. పార్టీ రహితంగా జరిగే సహకార ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సిపి బలపరిచిన వారికి తాను మద్దతు ఇస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు.

‌మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ‌వివిధ రకాల సబ్సిడీల పేరుతో రైతులకు ఎంతో మేలు చేశారని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. ఆ మహానేత ఆశయాలతో నడిచే పార్టీ బలపరిచిన అభ్యర్థులను సహకార ఎన్నికల్లో గెలిపిస్తేనే రైతులకు మేలు జరుగుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్ జల‌యజ్ఞంతోనే జిల్లాలో హంద్రీ - నీవా, గాలేరు - నగరి ప్రాజెక్టుల నిర్మాణం జరిగి వేలాది ఎకరాలకు సాగునీరు అందుతోందని చెప్పారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తూరు జిల్లా కన్వీనర్ నారాయుణస్వామి ‌మాట్లాడుతూ, పెద్దిరెడ్డి మద్దతుతో జిల్లా సహకార ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులకు మరింత బలం పెరిగిందన్నారు. డిసిసిబి చైర్మన్ పదవితో  పాటు సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయుం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Back to Top