వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలోకి ద్వారంపూడి

కాకినాడ, 13 జనవరి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని దెబ్బ తీయాలని కాంగ్రెస్‌, టిడిపిలు వంద కుట్రలు పన్నినా జనం మాత్రం జన నేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి వెంటే ఉంటా‌మని రుజువు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖ‌ర్‌రెడ్డి ఆదివారంనాడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాకినాడలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సిపి జిల్లా కన్వీనర్‌ కుడుపూడి చిట్టబ్బాయి పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు.

చంద్రశేఖ‌ర్‌రెడ్డితో పాటు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్ నాయకుడు కర్రి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్‌ పసుపులేటి వెంకటలక్ష్మి, 50 మంది మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అంతకు ముందు చంద్రశేఖ‌ర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.‌

ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం వేధించడాన్ని చూసి తట్టుకోలేకే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపారు. గత రెండు మూడు రోజులుగా తన మద్దతుదారులతో సమావేశాలు నిర్వహించుకుని వైయస్‌ఆర్‌సిపిలో చేరాలని, శ్రీ జగన్‌కు, ఆయన కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నామని ద్వారంపూడి పేర్కొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన విమర్శించారు.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర మానుకొని ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెడితే తాను మద్దతు ఇస్తానని ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. వైయస్‌ఆర్‌సిపి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్‌ కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, జి. వెంకటరమణ తదితరులు ద్వారంపూడిని పార్టీలోకి ఆహ్వానించారు.
Back to Top