వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రాజేష్

హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ (కాంగ్రెస్) సోమవారం వైయస్ఆర్ కాగ్రెస్ పార్టీలో చేరారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పార్టీలో కార్యకర్తగా సాగుతానని ప్రకటించారు. బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్న తనను మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి రాజకీయాలలోకి తీసుకొచ్చారని రాజేష్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో  ఎందరో వ్యతిరేకించినప్పటికీ తనకు పార్టీ టికెటిచ్చారని చెప్పారు. చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనీ, సంక్షేమ కార్యక్రమాలలో అలసత్వం కూడదనీ వైయస్ స్పష్టంగా సూచనలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన ఆకాంక్ష మేరకు రూ. 200 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని రాజేష్ వివరించారు.   వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించాలని కోరుతూ తాను కూడా సంతకం చేశానన్నారు. జగన్ చేపట్టిన దీక్షలలో విజయవాడ దీక్ష వరకూ తాను కూడా పాల్గొన్నాననీ, తర్వాత కొన్ని కారణాల వల్ల దూరమయ్యానని చెప్పారు. మహానేత వైయస్  మరణానంతరం  ఆయన కుటుంబానికి జరుగుతున్న అన్యాయన్ని ఖండిస్తున్నానన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో కూలంకషంగా చర్చించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆమేరకు విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరానన్నారు.  తనకు సహరించిన మాజీ మంత్రి మారెప్ప, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, జ్యోతుల నెహ్రూ, పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షునికీ  ఆయన కృతజ్ఙతలు తెలిపారు. స్పీకరుకు రాజీనామా పంపిస్తున్నట్లు రాజేష్ ప్రకటించారు. ఇలా ఉండగా.. తాను నవంబరు నాలుగున విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరతానని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు(టీడీపీ) సోమవారం కొవ్వూరులో ప్రకటించారు. గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత కూడా ఆయనను కలిశారు. త్వరలో తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు.

Back to Top