ఉప్పొంగిన జనవాహిని

హైదరాబాద్‌, 18 అక్టోబర్ 2012: ఇడుపులపాయ నుండి ప్రారంభమైన పాదయాత్రకు అనూహ్య స్పందన రావడం, లక్షలాదిగా జనం హాజరు కావడంతో వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. మరో ప్రజాప్రస్థానానికి ప్రజలు బ్రహ్మరథం పట్టడం, ఇసుక వేస్తే రాలనంతగా జనం రావడం పార్టీ వర్గాలకు సరికొత్త ఊపునిచ్చింది. వైయస్.విజయమ్మ, షర్మిల తన ప్రసంగాలలో ప్రభుత్వ, ప్రధాన ప్రతిపక్షాల వైఫల్యాలను సూటిగా, పదునైన మాటలతో ఎండగట్టడం, మాటమాటకూ సభలోని ప్రజల నుండి హర్షధ్వానాలు రావడం ప్రజాస్పందన వైయస్సార్‌ పార్టీకి అనుకూలంగా ఉందన్న సంకేతాలనిచ్చింది.
కిలోమీటర్ల కొద్దీ దూరం వాహనాలు బారులు తీరడం, కాలు తీసి కాలు వేయడానికి కూడా వీల్లేనంతగా జనవాహిని ఉప్పొంగడం పార్టీకి కొత్త సత్తువనిస్తుందని భావిస్తున్నారు. పాదయాత్ర సుదీర్ఘంగా 16 జిల్లాల గుండా సాగుతుంది కనుక రాష్ట్రమంతటా తప్పక పార్టీకి బలమైన సానుకూల పవనాలు వీస్తాయని నాయకులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. జనంలో ఉండడమే ఈ యాత్ర ప్రధానోద్దేశ్యం. అలాగే అటు అధికారపక్షాన్నీ, ఇటు ప్రతిపక్షాన్నీ సమానంగా, సమర్థంగా ఎదుర్కోవడం కూడా యాత్ర వ్యూహం. కాంగ్రెస్, టిడిపి కుట్రల కుమ్మక్కు వైనాన్ని ప్రజల ముందుంచుతూనే, ప్రజాసమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించడం షర్మిల పాదయాత్ర లక్ష్యం. ఈ ధ్యేయం పూర్తిగా నెరవేరుతుందనీ, జగన్మోహన్‌రెడ్డి బయటకు వచ్చాక పార్టీ మరింత బలోపేతమౌతుందనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ప్రభంజనాన్ని సృష్టించనుందనీ వైయస్సార్‌ కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Back to Top