ఉపఎన్నికలు రావనే ధీమాతోనే ఎమ్మెల్యేలపై వేటు

హైదరాబాద్‌ :

ఉప ఎన్నికలు రావనే ధీమాతోనే విప్‌ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ ‌సిజిసి సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. సాధారణ ఎన్నికలకు ఏడాదికన్నా ఎక్కువ సమయం ఉన్నప్పుడే అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేసి ఉంటే.. ఉప ఎన్నికలు వచ్చి ఉండేవని, ఎన్నికలు జరిగి ఉంటే కాంగ్రె‌స్, ‌టిడిపి బండారం బయటపడి ఉండేదన్నారు. ఎన్నికలు రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ రెండు పార్టీలు కుట్ర పన్నే ఇలా చేశాయన్నారు. స్పీకర్ ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సిందని, ఉప ఎన్నికలొస్తే కాంగ్రె‌స్, ‌టిడిపి ఘోర పరాజయం పాలు కావాల్సి వస్తుందనే ఇప్పుడు అనర్హత వేటు వేశారన్నారు.

15 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముందుకు రావచ్చని ఆయన అన్నారు. ‘తాను ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు ఉండాలి.. కానీ ప్రభుత్వం పడిపోకూడదు...’ అనే విధానాన్ని బాబు అనుసరిస్తున్నారని మైసూరా దుయ్యబట్టారు. అధికార పక్షంతో స్పష్టమైన అవగాహనతో ఉన్న చంద్రబాబు.. పీఆర్పీ, కాంగ్రెస్‌లో విలీనం కాక ముందు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టలేదన్నారు. పీఆర్పీ విలీనం అయ్యే దాకా ఆగి, ప్రభుత్వం పడిపోదని నిర్ధారించుకున్న తర్వాత అవిశ్వాసం పెట్టారన్నారు. చంద్రబాబు ఈ ప్రభుత్వంపై ఎప్పుడు అవిశ్వాసం పెట్టినా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మద్దతిస్తుందని‌ మైసూరారెడ్డి చెప్పారు.

Back to Top