ఉల్లి రైతులకు భరోసా ఇచ్చిన షర్మిల

పత్తికొండ (కర్నూలు జిల్లా), 11 నవంబర్‌ 2012: ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేక తామంతా అనేక కష్టాలు పడుతున్నామని షర్మిలకు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని ఉల్లి రైతులు తమ గోడు వినిపించారు. ఉల్లి పండించేందుకు తాము పెట్టిన పెట్టుబడులైనా రాకపోగా, అప్పులే మిగులుతున్నాయని వారు కన్నీరు మున్నీరయ్యారు. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆదివారం నాడు 25వ రోజు ఉదయం పత్తికొండ శివారులో పాదయాత్ర చేస్తున్న షర్మిలను కలిసుకున్నారు. ఇదే పరిస్థితి ఇకపైనా కొనసాగితే తమకు ఆత్మహత్యలే శరణ్యమని షర్మిలకు విన్నవించారు.

ఉల్లిరైతుల గోడు స్వయంగా విన్న షర్మిల స్పందిస్తూ, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకున్నాక అందరి సమస్యలూ తీరిపోతాయని ఉల్లి రైతులకు షర్మిల ధైర్యం చెప్పారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉల్లి‌ పంటకు గిట్టుబాటు ధర కల్పించారని  ఈ సందర్భంగా ఉల్లి రైతులు గుర్తుచేసుకున్నారు. కాని ప్రస్తుత ప్రభుత్వం తమ సమస్యలను అస్సలు పట్టించుకోవడమే లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Back to Top