వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ విజయ దుందుభి తథ్యం

హైదరాబాద్:

శ్రీ జయ నామ సంవత్సరంలో గ్రహగతులు వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీకి విశేష అనుకూలతలు సూచిస్తున్నాయని ప్రముఖ సిద్ధాంతి మారేపల్లి రామచంద్రశాస్త్రి తెలిపారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో సీమాంధ్రలో వైయస్ఆర్‌సీపీ  140 నుంచి 145 అసెంబ్లీ స్థానాల్లో విజయ దుందుభి మోగిస్తుందని చెప్పారు. ఇతర పార్టీలు కలసికట్టుగా వచ్చినా, విడివిడిగా పోటీ చేసినా విజయం ధర్మం వైపే ఉంటుందని చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ను వ్యతిరేకించే పార్టీలు ఎన్ని పొత్తులు కుదుర్చుకున్నా అపజయాన్ని తప్పించుకోలేవని, వాళ్లు కలసినా పరస్పరం ఓట్ల మార్పిడి జరగదని చెప్పారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పార్టీ కేంద్ర కార్యాలయంలో రామచంద్రశాస్త్రి సోమవారం పంచాంగ శ్రవణం చేశారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి అద్భుతమైన, ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉందని, ఆయన ప్రజలకు నిస్సందేహంగా స్థిరమైన పరిపాలనను అందిస్తారని శాస్త్రి చెప్పారు.

పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండటంతో పార్టీ సీనియర్‌ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు పి.ఎన్.వి.ప్రసాద్, వాసిరెడ్డి పద్మ, బి.జనక్‌ప్రసాద్, గట్టు రామచంద్రరావు, నల్లా సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు‌ ముందు దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు.

రాజు సరైన రాజ లక్షణాలు కలిగి ఉంటే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని, కొత్త రాష్ట్రంలో అనేక భాగ్యనగరాలు నిర్మించుకుంటారని రామచంద్రశాస్త్రి తెలిపారు. ప్రజల గురించి ఆలోచించే వారు ఎపుడూ ఎన్నికలకు భయపడరని చెప్పారు. ఎన్నికలంటే భయపడని పార్టీనే విజయం వరిస్తుందన్నారు. దివంగత రాజశేఖరరెడ్డి ప్రజా సమస్యలు తెలుసుకుని, వారి మనసెరిగి పరిపాలించారని అందుకే ఆయన ప్రజల హృదయాల్లో నిలిచారని కొనియాడారు. వార్థక్యంలో ఉన్న కొందరు నేతలు ఇక పక్కకు తప్పుకుని యువకులకు అధికారపగ్గాలు వస్తే అభివృద్ధి శరవేగంతో జరుగుతుందని చెప్పారు.

Back to Top