త్వరలోనే వైయస్‌ సువర్ణయుగం: విజయమ్మ

పులివెందుల (వైయస్‌ఆర్‌ జిల్లా), 21 అక్టోబర్‌ 2012: జగన్‌బాబు నేతృత్వంలో‌ మరలా మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డిగారి స్వర్ణయుగం తప్పకుండా వస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ ధీమాగా చెప్పారు. రాజశేఖరరెడ్డిగారు అమలు చేసిన పథకాలన్నింటినీ పార్టీ జెండాలో పెట్టుకుని, వాటిని తప్పకుండా అమలు చేస్తానంటూ జగన్మోహన్‌రెడ్డి జనం ముందుకు వస్తున్నాడని ఆమె వివరించారు. సాక్షి టివిలో ఆదివారం ఉదయం విజయమ్మ మాట్లాడారు. ప్లీనరీలో జగన్‌ ప్రకటించినవన్నీ నెరవేరుతాయని గుర్తుచేసి, ప్రజల్లో ధీమాను కలిగించడానికి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు.
తల్లులకు భరోసా 'అమ్మ ఒడి పథకం':
పిల్లలను బడికి పంపించడానికి అమ్మల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తానని భరోసా ఇచ్చే 'అమ్మ ఒడి పథకం' నిజానికి జగన్ ప్రకటించిన గర్వించదగ్గ పథకమని హర్షం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వంపైన, అలాంటి ప్రభుత్వాన్ని నిలదీసి, పడేయకుండా మద్దతు ఇస్తున్న టిడిపిలపైన జగన్ వదిలిని బాణమే షర్మిల అని విజయమ్మ అభివర్ణించారు. పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తానని జగన్‌ చెబుతున్నాడు. పిల్లలను పనికి కాకుండా బడికి పంపించడానికి ఇద్దరు బిడ్డల వరకూ ఒక్కొక్క బిడ్డకూ అమ్మ ఒడి పథకం ద్వారా నెలకు 500 రూపాయలు వేస్తానంటున్నాడు. వృద్ధులకు వైయస్‌ ఇచ్చిన రెండు వందల రూపాయలు పింఛన్ సరిపోవడంలేదని కొందరు జగన్‌కు చెప్పుకున్నారు. వారు మూడు పూటలా అన్నం తినడానికి వారికి ‌700 రూపాయలు, వికలాంగులకు వెయ్యి రూపాయలు చేస్తానని చెప్పాడు. రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేదానికి 3వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని బడ్జెట్‌ పెడతానని జగన్‌ హామీ ఇచ్చారన్నారు. అన్న నేతృత్వంలో ఇవి అన్నీ అమలవుతాయని ప్రజలకు చెప్పేందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. 
కాంగ్రెస్‌, టిడిపిల ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా ఇప్పటికే వాటికి డిపాజిట్లు కూడా పోయాయని, వారు చెప్పే అబద్ధాలకు, చేసే దుర్మార్గాలకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని విజయమ్మ అన్నారు. జగన్‌బాబు నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రజలు రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. అలాంటి ధైర్యం చెప్పడానికి, భరోసా ఇవ్వడానికే షర్మిల, తాను ప్రజల మధ్యలు వచ్చామని చెప్పారు.
టిడిపి నాటి దురవస్థే ఇప్పుడూ ఉంది:
విధి లేని పరిస్థితుల్లో తాను ఈ రోజు బయటికి రావాల్సి వచ్చిందని విజయమ్మ అన్నారు. 2003లో టిడిపి పాలనతో రాష్ట్ర ప్రజలు ఎన్నెన్నో ఇబ్బందులు పడుతుండడంతో వారి కష్ట సుఖాలు తెలుసుకుని వారికి ధైర్యం నింపేందుకే అంతటి ఎండలో కూడా వైయస్‌ ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా అలాంటి దుర్భర పరిస్థితులే రాజ్యం ఏలుతున్నాయని విమర్శించారు. నిజానికి జగనే ఈ పాదయాత్ర చేయాలనుకున్నాడు. గత నెల బెయిల్‌ వస్తుందని, ఈ నెల 5న వస్తుందని ఎదురుచూశాం. రూట్‌ మ్యాప్‌ కూడా రూపొందించుకున్నాడు. అయితే ఆయన రాలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాలు పడుతున్న 8 కోట్ల ప్రజల మధ్యన మన కుటుంబం ఉండాలని, వారికి భరోసా ఇవ్వాలని‌, అందుకు పాదయాత్ర చేస్తే బాగుంటుందని జగన్ చెప్పాడు. ఆరోగ్య రీత్యా నేను అంత సుదీర్ఘ పాదయాత్ర చేయలేని పరిస్థితుల్లో అక్కడే ఉన్న షర్మిల తాను పాదయాత్ర చేస్తానంటూ ముందుకు వచ్చినట్లు చెప్పారు.
సమస్యలతో అన్నదాత సతమతం అవుతున్నాడు:
రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు లేవు. కరెంటు లేదు. పల్లెల్లో రెండు గంటలు కూడా కరెంట‌ు ఉండడం లేదు. రాజశేఖరరెడ్డి ప్రకటించిన ఉచిత విద్యుత్‌ను కూడా ప్రస్తుత ప్రభుత్వం తీరు వల్ల రైతులు ఉపయోగించుకునే పరిస్థితి లేదని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటికి కూడా ఇబ్బందిగా ఉందన్నారు. కడప జిల్లాలో కూడా నీటి సమస్య దారుణంగా ఉందన్నారు. గత ఏడాది అయితే నక్కలపల్లి స్టోరేజ్‌ వరకూ కూడా నీళ్ళా రాలేదన్నారు. జిల్లాలో నీటి సౌకర్యం కోసం తాను, బయట ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి కూడా అనేక సార్లు కలెక్టర్‌కు విజ్ఞప్తులు చేశామన్నారు. రైతులకు నష్టపరిహారం ఇమ్మని, ఇన్‌పుట్‌ అందజేయమని ఎన్నిసార్లు ఫోన్లు చేసినా, లేఖలు రాసినా ప్రభత్వం స్పందించలేదని దుయ్యబట్టారు. నీళ్లు లేక చినీ చెట్లు ఎండిపోయాయి. నాలుగైదు సంవత్సరాలు ప్రేమగా పెంచుకున్న చెట్లు ఎండిపోతే ఆ రైతుకు ఎంత దిగులుగా ఉంటుంటో అర్థం చేసుకోవాలని అన్నారు. ఒక 
మేం పాదయాత్రలో వెళుతున్నప్పుడు ఒక రైతు వచ్చి తాను పది బోర్లు వేసుకున్నా ఫలితం లేదని తనకు మూడు వందలు ఇచ్చి పోమ్మా ఆత్మహత్య చేసుకుంటానని నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఏమి చెప్పాలో అర్థంకాని పరిస్థితి ఎదురైందన్నారు. పొలాల్లోకి పోయినప్పుడు రైతులు అప్పుల్లో ఉన్నామని, తమకు ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదని చెప్పారు.
ఇద్దరు బిడ్డల అవస్థలపై ఆవేదన:
ఫీజు రీయింబర్సుమెంట్ కోసం జగన్‌ హైదరాబాద్‌లో వారం రోజులు నిరాహార దీక్ష చేసినా ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సమస్య తెలుసుకునేందుకు ఒక్క మంత్రిని కూడా దీక్షా శిబిరానికి పంపించిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. ఇద్దరు బిడ్డల్లో ఒకరు జైలులో ఉండడం, మరో బిడ్డ రోడ్డు మీదకు రావాల్సి రావడం ఒక తల్లిగా తనకు చాలా చాలా కష్టంగా ఉందని గద్గద స్వరంతో చెప్పారు. అసలు ఆ మాట అనుకుంటుంటేనే తనకు బాధగా ఉందని దుఃఖంతో నిండిన కంఠంతో ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖరరెడ్డిగారు మన మధ్యన లేరని, ఉన్న ఇద్దరు బిడ్డల్లో జగన్‌ను కుట్ర చేసి జైలుతో పెట్టారని, ఏదీ కాని పరిస్థితుల్లో పాప కూడా రోడ్డు మీదకు రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డను బయటికి పంపించాలంటే చాలా బాధ అనిపిస్తోందమ్మా అని జగన్‌ కూడా అన్నారటి తెలిపారు. ఎనిమిది కోట్ల మంది మన మీద ఆధారపడి ఉన్నారమ్మా, వారకి ధైర్యం చెప్పేందుకు మనం పోవాలని అన్నాడని చెప్పారు. రాష్ట్ర ప్రజలు నిరాశలో ఉన్నప్పుడే మనం వారి మధ్య ధైర్యాన్నిస్తూ ఉండాలమ్మా అని జగన్‌ చెప్పాడని అన్నారు.
అందరికీ పంచాలన్నది వైయస్‌ నైజం:
ప్రజల గురించి ఎన్నో సంక్షేమ పథకాలు ఆలోచించి, ప్రవేశపెట్టిన వైయస్‌ ఏనాడూ స్వార్థం కోసం ఉపయోగించుకోలేదని విజయమ్మ పేర్కొన్నారు. ఎంతసేపూ పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలగకూడదనే ఆలోచించేవారన్నారు. ఏ వ్యక్తీ కూడా రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వల్ల నష్టపోయామని అనకూడదన్న లక్ష్యంతోనే పనిచేశారన్నారు. ఆయన పంచిపెట్టే మనిషే గాని దాచిపెట్టుకునేవారు కాదని వివరించారు. రాజశేఖరరెడ్డిగారు జవాబు చెప్పుకోలేరనే ఆయనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గురించి ఎవరెన్ని విధాలుగా ఆరోపించినా దేవుడు వారికి ఒకసారి సరైన జవాబు చెబుతాడన్నారు.
వ్యవస్థలను రద్దుచేసిన చంద్రబాబు:
వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు రద్దు చేశారని విజయమ్మ ఆరోపించారు. ఎన్టీఆర్‌ పెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని రూ. 5.25 చేసి సామాన్యుల ఆకలిపై దెబ్బకొట్టారని విమర్శించారు. మహిళల సంక్షేమం కోసం మద్యపాన నిషేధం విధిస్తే చంద్రబాబు మళ్ళీ దాన్ని తీసుకువచ్చారన్నారు. ఈ రోజు బెల్టు షాపులను రద్దు చేస్తానంటూ చెబుతున్నారని, అయితే బెల్టు షాపులు తీసుకువచ్చిందే చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణ మాఫీ చేస్తానని ఇప్పుడు చెబుతున్నారని, ఆయన హయాంలో ఎందుకు ప్రయత్నం చేయలేదని నిలదీశారు. ప్రధాని పదవిని త్యాగం చేసినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని, ప్రధానిని చేశానని, రాష్ట్రపతిని చేశానని చెబుతున్నారని, కేంద్రంలో చక్రం తిప్పిన మనిషి రుణమాఫీ గాని, రీషెడ్యూల్‌ గాని ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే ఉచిత విద్యుత్ ఫైలుపై వైయస్‌ సంతకం చేసి అమలు చేసిన వైనాన్ని విజయమ్మ గుర్తుచేశారు. 13 కోట్ల రూపాయల కరెంటు బకాయిలు రద్దు చేశారన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే లక్ష రూపాయలు పరిహారం ప్రకటించారన్నారు. సిఎం అయిన కొద్ది రోజులకే మూడు నాలుగుసార్లు ప్రధానిని కలిసి రాష్ట్ర ప్రజల ఇబ్బందులు వివరించి ప్రత్యేక ప్యాకేజ్‌ తీసుకువచ్చారన్నారు. రాజశేఖరెడ్డి వల్ల దేశానికే రుణమాఫీ వచ్చిందన్నారు. కేవలం మన రాష్ట్రంలోనే 66 లక్షల మంది రైతులకు 12 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ వచ్చిందన్నారు. అంతకు ముందే బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించిన వారికి ఒక్కొక్కరికీ ఐదేసి వేల రూపాయలు ప్రోత్సాహకంగా అందజేశారన్నారు.
చంద్రబాబు అసలు ఉద్దేశం ఏమిటి?:
ఉచిత విద్యుత్‌ ఇస్తానని వైయస్‌ ప్రకటించినప్పుడు చంద్రబాబు ఏమన్నారు? అది సాధ్యం కాదన్నారు. మధ్యలో ఏమి చెప్పారు? ఉచిత విద్యుత్‌ ఇచ్చి ఉంటే నేనే గెలిచి ఉండేవాడిని అన్నారు. ఉచిత విద్యుత్‌ పెట్టలేదు కనుక తాను ఓడిపోయానన్నారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఏమి చెబుతున్నారు? నేను ఆ రోజే చెప్పాను కదా! ఉచిత విద్యుత్‌ ఇవ్వడమంటే విద్యుత్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవడానికే అన్నానని చెబుతున్నారు. అంటే ఆయన ఉచిత విద్యుత్‌ పెడతారా? పెట్టరా? అని సూటిగా ప్రశ్నించారు. ఈ రోజు మళ్ళీ తాను అది చేస్తాను, ఇది చేస్తానంటూ మోసపు మాటలు, అబద్ధపు మాటలు చెబుతున్నారు. ఆయన మాట మీద నిలబడతారా? లేదా అనేది ప్రజలకు బాగా తెలుసన్నారు.
కష్టకాలంలో దన్నుగా ఉన్న ప్రజలకు ధన్యవాదాలు:
ప్రజలు చాలా విజ్ఞులని, తెలివైన వారని, వారికి అన్నీ తెలుసని అన్నారు. కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చి సొంతంగా పార్టీ పెట్టిన కష్టకాంలో కూడా జగన్‌బాబుకు ఇంత మెజారిటీ ఇచ్చి గెలిపించిన కడప ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. జగన్‌కు‌ మొన్న 5న బెయిల్ వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పూజలు చేస్తున్న సమయంలో ఒక్క రోజు ముందు టిడిపి ఎంపీలను చిదంబరం దగ్గరికి పంపించి చంద్రబాబు కుట్ర చేసి బెయిల్‌ రాకుండా చేశారని ఆరోపించారు. చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీలో కలిసిపోయి, ప్రభుత్వం పడిపోదన్న పరిస్థితి వచ్చిన తరువాతే చంద్రబాబు అవిశ్వాసం పెట్టారని ఆరోపించారు. వైయస్‌ కాంగ్రెస్‌ పార్టీని నిలవనివ్వకూడదని, ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు అసెంబ్లీకే డబ్బులు తెచ్చి బేరసారాలు పెట్టారని అన్నారు. అయితే, తమ ఎమ్మెల్యేలందరూ ఒక్క మాట మీద నిలబడ్డారని ప్రశంసించారు. ప్రజల అభిమానం దేవుని ఆశీస్సుల కారణంగా తమ పార్టీ సభ్యులు ఇంతమంది గెలిచారన్నారు. ఇంత అసమర్థ ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండు అర్హత లేదని విజయమ్మ అన్నారు.
నిక్కచ్చిగా ఉండే జగన్మోహన్‌రెడ్డి:
వైయస్‌ అసెంబ్లీలో మాట్లాడిన కేసెట్లు తెచ్చి వినమని, అనుభవం వస్తుందని తాను చెబితే, వద్దమ్మా అట్లా తప్పు చేయకూడదని జగన్ చెప్పిన నిక్కచ్చి మనిషి అన్నారు.‌ జైలులో విఐపి ట్రీట్‌మెంటు అనుభవిస్తున్నట్లు టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణలను విజయమ్మ ఖండించారు. మూడు అడుగుగుల మంచం, ఒక టేబిల్‌, ఒక కుర్చీ ఉంటుందని, ఒకే బాత్రూంను ముగ్గురు వినియోగించుకోవడాన్ని విఐపి ట్రీట్‌మెంట్‌ అంటారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఏనాడూ లేని విధంగా జైలులో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారని అన్నారు. చివరికి పెళ్ళి రోజున భారతి జగన్‌ను కలుసుకున్నప్పుడు కూడా జైలు అధికారి దగ్గరే కూర్చున్నారని, ఇలాంటి పరిస్థితులనే విఐపి ట్రీట్‌మెంటుగా వారు చెబుతారా? అని ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డిగారు ఉన్నప్పుడు కూడా ఇప్పడు వస్తున్న మాదిరిగానే ఆరోపణలు వస్తూనే ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు చాలా కష్టంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి ఒక్కరి సమస్యలపైనా జగన్‌బాబు స్పందించారని విజయమ్మ చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా చంద్రబాబు తన బాధ్యతను విస్మరించారన్నారు. ప్రజలు ఇన్ని సమస్యలతో సతమతం అవుతుంటే ఏ నాయకుడైనా స్పందించారా అన్నారు. కరెంటు సమస్యపై ధర్నా చేయాల్సి వస్తే చంద్రబాబు నాయుడు విమానాశ్రయానికి పోతూ పోతూ ఒక్క అరగంట పాటు శంషాబాద్‌లో ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్సు కోసం తమ పార్టీ కార్యాలయం ముందున్న కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు దగ్గర మరో అరగంట ధర్నా చేసి వెళ్ళారని ఎద్దేవా చేశారు. అదే జగన్‌బాబు అయితే, రెండురోజులు, మూడురోజులు, వారం రోజులు దీక్షలు చేసి తనను తాను కాల్చుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులు దీక్ష చేసినప్పుడైతే తాను ఏడ్చానని, వారం రోజులు ఏమీ తినకుండా ఉంటావా నాన్నా? అని అడిగానని చెప్పారు. తాను వారం రోజులు నేను తినకపోయినా పరవాలేదమ్మా అని, తన తమ్ముళ్ళు, చెల్లెళ్ళకు ఏ కొంచెం మంచి జరిగినా మంచిదే అని జగన్‌ అన్నారని చెప్పారు.
జగన్‌ బయటికి వచ్చే వరకూ నల్ల బ్యాడ్జీలు:
ప్రజల కోసం మాత్రమే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని, జగన్‌బాబును అన్యాయంగా జైలులో పెట్టినందుకు నిరసనగానే నల్లబ్యాడ్జీలు పెట్టుకుంటున్నట్లు విజయమ్మ వివరించారు.‌ న్యాయానికి జైలులో పెట్టిన 90 రోజులకు బెయిల్ ఇవ్వాల్సి ఉంటుందని, అయితే, ఆయనకు బెయిల్‌ రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌కు బెయిల్‌ వచ్చేంత వరకూ నల్లబ్యాడ్జీ పెట్టుకుంటామన్నారు. రాజశేఖరరెడ్డి, జగన్మోహన్‌రెడ్డిని అభిమానించే వారంతా జగన్‌కు బెయిల్‌ వచ్చే వరకూ నల్లబ్యాడ్జీలు ధరించి తమ నిరసనకు సంఘీభావం పలకాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.
Back to Top