పల్నాడు జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ దళిత కార్యకర్త హత్యను తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం వైయస్‌ జగన్‌

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి

టీడీపీ గూండాల అరాచకాలకు ఇది నిదర్శనం

తాడేపల్లి : పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్‌ హత్యను మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, చట్టబద్ధ పాలన పూర్తిగా కూలిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన దళిత కార్యకర్తను అన్యాయంగా టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారని పేర్కొంటూ, అధికార పార్టీ గూండాల అరాచకాలకు ఈ హత్య నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు ఎలాంటి భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారని పేర్కొన్న వైయస్‌ జగన్‌, ఈ ఘటనకు బాధ్యులైన వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన సాల్మన్‌ సోదరుడితో వైయస్‌ జగన్‌ ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. సాల్మన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, ఈ కష్టకాలంలో వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే దోషులపై కఠిన చర్యలు తీసుకుని, వారికి తగిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు.

ఫోన్‌ సంభాషణలో పిన్నెల్లి గ్రామంలో టీడీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలను సాల్మన్‌ సోదరుడు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే, స్థానిక పోలీసులు అధికార పార్టీ నేతలకు వంతపాడుతూ తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వైయస్‌ జగన్‌, వైయ‌స్ఆర్‌సీపీ క్యాడర్‌ ఎవరూ ఆందోళన చెందవద్దని, పార్టీ నుంచి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని భరోసానిచ్చారు.

సాల్మన్‌ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని సూచించారు. చేయకూడని తప్పులు చేస్తున్న వారిపై వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే చట్టప్రకారం తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సందర్భంగా గురజాల నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ పిన్నెల్లి గ్రామంలో నెలకొన్న పరిస్థితులు, వైయ‌స్ఆర్‌సీపీ క్యాడర్‌పై స్థానిక పోలీసు అధికారులు పెడుతున్న అక్రమ కేసుల వివరాలను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.

Back to Top