గుంటూరు: పిన్నెల్లి గ్రామంలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో సాల్మన్ అంత్యక్రియలు నిర్వహించి తీరుతామని, అడ్డుకోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హెచ్చరించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద సాల్మన్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన అనంతరం మాజీ మంత్రి మేరుగ నాగార్జునతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా జరిగే అంత్యక్రియల కార్యక్రమాన్ని అధికార పార్టీ నాయకులు అడ్డుకోవాలని చూడటం సరైన పద్ధతి కాదని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. అంతిమ సంస్కారాలు జరగకుండా అడ్డుకుంటే స్వయంగా మాజీ సీఎం వైయస్ జగన్ గారే వస్తారని కాసు మహేష్ రెడ్డి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలవుతున్నా ఇప్పటికీ రాజకీయ హత్యలతో దళితులు, బీసీలు, ముస్లింలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పిన్నెల్లి గ్రామంలోనే దాదాపు 300 కుటుంబాలను గ్రామంలోకి రానీయడం లేదని చెప్పారు. పీస్ కమిటీ వేసి వారిని పోలీసుల సమక్షంలో గ్రామంలోకి రప్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ కూడా వేశామని అందర్నీ గ్రామంలోకి వచ్చేలా చూస్తామని స్పష్టం చేశారు. హత్యలు, అఘాయిత్యాలు, వెలివేతలు, దాడులను తెలుగుదేశం ప్రభుత్వం పేటెంట్ తీసుకుని దళితులను వేధిస్తుందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. సాల్మన్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారు ఇంకా ఏమన్నారంటే... ●వైయస్‌ఆర్‌సీపీ హయాంలో ఇంటింటికీ అభివృద్ధి - మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గత వైయస్‌ఆర్‌సీపీ హయాంలో ఇంటింటికీ శుద్ధి చేసిన కృష్ణా జలాలను అందించాం. వీధివీధికీ సిమెంట్ రోడ్లు వేయించాం. గురజాలకు మెడికల్ కాలేజీని తీసుకొచ్చాం. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అంబేద్కర్ రాజ్యాంగానికి బదులుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల, దాచేపల్లిలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయి. 19 నెలల్లో ఏడుగురు వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను అమానుషంగా చంపేశారు. పిన్నెల్లి గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీకి మద్దతు తెలిపిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన సుమారు 300 కుటుంబాలకు చెందిన వెయ్యి మందిని గ్రామం నుండి తరిమేస్తే వారు గుంటూరు, హైదరాబాద్‌లలో కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్న దుస్థితి. మేం రూ.300 కోట్లతో నియోజకవర్గంలో తాగునీటి ప్రాజెక్టులు చేపడితే కూటమి ప్రభుత్వం వాటిని కనీసం నిర్వహించలేకపోతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కలుషిత నీరు తాగి పిడుగురాళ్ల, దాచేపల్లిలో ఎనిమిది మంది డయేరియాతో మరణించారు. మృతుల కుటుంబాలకు ఈ దుర్మార్గ ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం ఎక్స్‌గ్రేషియా కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వానికి చేతనైతే మాకన్నా ఎక్కువ అభివృద్ధి చేసి చూపించాలి. అంతేకానీ ఎన్నికలు ముగిసి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ రాజకీయాలు చేయడం దుర్మార్గం. ● అపస్మారక స్థితిలో ఉన్న సాల్మన్ పైనే కేసు 18 నెలలుగా ఊరికి దూరంగా ఉన్న ఎస్సీ నాయకుడు సాల్మన్, అత్యవసర పరిస్థితిలో తన ఇంటికి వెళ్తే అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మూడు రోజులపాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి మరణించాడు. పోలీసులకు ఫోన్ చేస్తే భద్రత కల్పించకుండా ఊర్లోకి ఎందుకొచ్చారని ప్రశ్నిస్తున్నారు. దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయాల్సిన పోలీసులు తలకు దెబ్బతగిలి అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడు సాల్మన్, అతని తమ్ముడిపపైనే 324 సెక్షన్ కింద కేసులు పెట్టారు. సాల్మన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడని తెలిసి అప్పుడు నిందితులపైన కేసు పెట్టారు. గ్రామ బహిష్కరణ చేసి ఒకవైపు టీడీపీ నుంచి వేధింపులు ఎదుర్కొంటుంటే పీస్ కమిటీలు వేసి బాధితులను గ్రామానికి రప్పించాల్సిందిపోయి పిడుగురాళ్ల సీఐ భాస్కర్ రావు, ఎస్సైలు మరింత వేధిస్తున్నారు. గురజాల నియోజకవర్గంలో పోలీసుల నుంచి బాధింపబడుతున్న వారే దాదాపు 30 మంది వరకు ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సాల్మన్ హత్య ఘటనపై స్పందించి అందుకు కారకులైన సీఐ, ఎస్సైలను తక్షణం సస్పెండ్ చేయాలి. బాధితులకు న్యాయం జరగకపోతే భవిష్యత్తులో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ అరాచకాలపై సీబీసీఐడీ విచారణ జరిపిస్తాం. ఇందుకు కారకులైన వారెవర్నీ వదిలే ప్రసక్తే లేదు. గ్రామం నుంచి వెళ్లగొట్టిన కుటుంబాలను తక్షణం తిరిగి గ్రామంలోకి తీసుకురావాలి. ఇప్పటికే దీనిపై హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. కోర్టు ఆదేశాలతో బాధితులందర్నీ తిరిగి గ్రామానికి రప్పిస్తాం. రెడ్ బుక్‌తో మాకు ఈరోజు పాఠాలు నేర్పుతున్న వారందరికీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠాలు నేర్పిస్తాం. ● పిన్నెల్లిలోనే సాల్మన్ మృతదేహానికి అంత్యక్రియలు సాల్మన్ కుటుంబానికి వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుంది. ఆయన మృతదేహానికి ఈరోజు (శుక్రవారం) కుటుంబ సభ్యుల సమక్షంలో పిన్నెల్లి గ్రామంలోనే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాం. దీన్ని కూడా అడ్డుకోవాలని కొందరు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. దీన్నుంచి పోలీసులు రక్షణ కల్పించాలి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. శాంతియుతంగా జరిగే అంతిమ సంస్కారాలను అడ్డుకుంటే మా నాయకులు వైయస్ జగన్ గారు స్వయంగా రంగంలోకి దిగుతారు. ఇప్పటికే ఈ ఘటనపై జగన్ గారు స్పందించారు. త్వరలోనే బాధిత కుటుంబ సభ్యులను కూడా కలుస్తారు. ● సాల్మన్ అంత్యక్రియలను అడ్డుకోవడం అమానుషం - మాజీ మంత్రి మేరుగ నాగార్జున సాల్మన్ హత్యను వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో గెలవడంతోనే ఎన్నో వేల కుటుంబాలను గ్రామాల నుంచి తరిమేశారు. ఇప్పటికీ గ్రామాల్లో అడుగుపెట్టనీయడం లేదు. వైయస్‌ఆర్‌సీపీకి ఓటు వేసిన దళితులను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా ఉసిగొల్పుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో బడిలో చదువుకునే దళిత బిడ్డలను సామాజిక బహిష్కరణ చేశారు. దళిత మహిళల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. దళిత ఉద్యోగులను వేధిస్తున్నారు. నిందితులను వదిలేసి బాధితుల మీదనే కేసులు పెడుతున్నారు. ఆఖరుకి టీడీపీ గూండాల చేతుల్లో హత్య గావించబడిన సాల్మన్ అంత్యక్రియలను కూడా గ్రామంలో నిర్వహించనీయకుండా అడ్డుకుంటున్నారంటే ఇంతకన్నా అమానుషం ఇంకోటి ఉంటుందా? హత్యలు, అఘాయిత్యాలు, వెలివేతలు, దాడులకు తెలుగుదేశం ప్రభుత్వం పేటెంట్ తీసుకున్నట్టుంది. దళితులను బతకనీయడం లేదు. సాల్మన్ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం స్పందించి బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి.