హైదరాబాద్, 7 మార్చి 2013: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొప్పుల వెలమలకు తొలిసారిగా శాసనమండలిలో అడుగుపెట్టే అవకాశాన్ని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. రాష్ట్ర శాసనసభ్యులు ఈ నెల 21న ఎన్నుకునే శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికల్లో ఆదిరెడ్డి అప్పారావును వైయస్‌ఆర్‌సిపి అభ్యర్థిగా ఎంపికయ్యారు. బుధవారం సాయంత్రం పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ అధ్యక్షతన జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో కొప్పుల వెలమ కులస్తులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. అయితే ఇంతవరకూ ఈ జిల్లాకు చెందిన కొప్పుల వెలమలను అన్ని పార్టీలు విస్మరించినప్పటికీ తమ పార్టీ తొలిసారిగా ఆ కులానికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పించిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తాను 2004 ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ బి.సి.లకు అధిక ప్రాతినిధ్యం ఇవ్వాలనే సదుద్దేశంతో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనకు మంత్రి పదవి ఇచ్చి ఆదరించారని ఆయన తెలిపారు.
జననేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి కూడా తండ్రి బాటలో పయనిస్తూ బి.సి.లకు ప్రాధాన్యమిచ్చి తాను కూడా వారి పక్షానే ఉన్నానని మరోసారి నిరూపించారని ప్రశంసించారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో కొప్పుల వెలమ కులస్తులు ఎక్కువగా ఉన్నప్పటికీ తూర్పు గోదావరి జిల్లా నుంచి వారు ఇంతకు ముందు ఎప్పుడూ చట్ట సభల ముఖం చూసి ఎరుగరని బోస్ అన్నారు. అప్పారావును ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో ఆ లోటు భర్తీ అయిందన్నారు.
'బలహీన వర్గాలకు జగన్ న్యాయం చేశారు' :వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి బలహీన వర్గాలకు న్యాయం చేశారని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. తనను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. బి.సి.లకు, బలహీనవర్గాలకు చాలా చేశామని పలు పార్టీలు చెప్పుకుంటూ ఉంటాయని, కానీ ఆచరణలో వారి పక్షాన నిలబడింది శ్రీ జగన్ మాత్రమే అని ఆయన అభిప్రాయపడ్డారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు, ప్రజా సంక్షేమానికి తాను కృషి చేస్తానని ఆదిరెడ్డి అప్పారావు అన్నారు.
కాగా, అప్పారావు ఈ నెల 9న తన నామినేషన్ దాఖలు చేస్తారని, ఆయన తప్పకుండా ఘన విజయం సాధిస్తారని పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదిరెడ్డి అప్పారావు దివంగత టిడిపి నాయకుడు కింజరాపు ఎర్రం నాయుడికి వియ్యంకుడు.