తక్షణం అసెంబ్లీని పెట్టండి

వైయస్సార్‌సీ ఎమ్మెల్యేలు

‌హైదరాబాద్‌, 28ఆగస్టు2012: దిక్కుతోచని స్థితిలో ఉన్న రాష్ట్ర ప్రజానీకాన్ని ఆదుకోడానికి ఇప్పుడు వైయస్సార్‌ కాంగ్రెస్‌కు చెందిన లెజిస్లేచర్‌పార్టీ కూడా రంగంలోకి దుమికింది. పార్టీ శాసనసభా పక్షం సరాసరి ఇందుకు శాసనసభనే తమ వేదికగా మలచుకోవాలని నిర్ణయించింది. ప్రజాసమస్యల పరిష్కారానికి తక్షణమే శాసనసభను సమావేశపరచాలనే డిమాండుతో మంగళవారంనాడు ముఖ్యమంత్రిని, స్పీకర్‌ను కలసి విజ్ఞాపనపత్రాలు అందజేయబోతోంది.

అన్ని సమస్యలనూ మించి ఇప్పుడు విద్యుత్‌ సమస్య రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. దీనితో వ్యవసాయం, పారిశ్రామికరంగంతో సహా అన్నిరంగాలూ సంక్షోభంలో చిక్కుకొన్నాయి. ఫలితం.. రాష్ట్రం అంధకార బంధురమే కాకుండా.. లక్షలాదిమంది ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది. కరెంటు లేకపోయినా.. వర్షాల ఆధారంగానైనా సాగుచేద్దామంటే.. విత్తనాలు, ఎరువులు సకాలంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన ధరలకు లభించక రైతన్నల గగ్గోలు. కష్టపడి ఎలాగోలా మార్కెట్‌లో లభించనవాటితో సాగుచేసేసరికి అన్నీ నాసిరకమే. ఇలాఎడాపెడా దెబ్బతిన్న రైతన్నలకు ఆత్మహత్యలే శరణ్యంగామారాయి. ఇక పారిశ్రామిక రంగమైతే కరెంటు లేక వారంలో మూడు నాలుగు రోజులు యంత్రాలను నిలిపివేయాల్సిన దుస్థితి. ఫలితం- ఉత్పత్తి పడిపోయి ఆర్డర్లకు సకాలంలో సరుకు అందించలేక యాజమాన్యాలు కష్టనష్టాల పాలవుతుంటే.. పనిలేక బతుకుతెరువు మృగ్యమై అసంఖ్యాక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. విద్యార్థుల కష్టాలుసరేసరి. చదవడానికి కరెంటు లేక అవస్థలు ఒకవైపు. ప్రభుత్వం ఉన్నత విద్యకు అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో సగానికి సగం, అంతకన్నఎక్కువగా కోతపెడుతుంటే.. పేదలు, మెరిట్‌ విద్యార్థులు దిక్కుతోచక తల్లడిల్లుతున్నారు. అన్నిరంగాలకు చెందిన వారిదీ ఇటువంటి దుస్థితే.

రాష్ట్రం ఇంతగా తల్లడిల్లుతుంటే.. రాష్ట్రపాలకులకు అధికారపీఠాన్ని కాపాడుకోవడం ఒక్కటే పనిగా కనపడుతోంది. ఇంతవరకు పదవులు రాని అధికారపార్టీ నేతలకు, వాటిని సాధించుకోవడమే పరమలక్ష్యంగా, ఏకైక సమస్యగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రితో సహా గత వారం పదిరోజులుగా రాష్ట్ర రాజధాని-దేశరాజధాని మధ్య సాగిన అధికారపక్షీయుల హడావుడి యాత్రలే ఇందుకు నిదర్శనం.

రాష్ట్రసమస్యలను గాలికి వదలి, అధికారం నిలబెట్టుకోడానికి ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడం చూసే ఇప్పుడు వైయస్సార్‌సీపీ లెజిస్లేచర్‌పార్టీకి వళ్లు మండింది. ఉపేక్షిస్తే లాభంలేదని, ప్రభుత్వం మెడలు వంచాల్సిందేనంటూ కార్యోన్ముఖమైంది.

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని చర్చించడానికి తక్షణమే రాష్ట్ర శాసనసభను సమావేశపర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం డిమాండ్ చేసింది. అసెంబ్లీలోని కమిటీ హాలులో సోమవారం జరిగిన ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు ఈ మేరకు ఒక తీర్మానం చేశారు. సమావేశం వివరాలను ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి మీడియాకు వెల్లడించారు. శాసనసభ సమావేశాలు నిర్వహించాలని కోరుతూ తాము ముఖ్యమంత్రిని, స్పీకర్‌ను కలుస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఢిల్లీచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిని దించాలని కొందరు ప్రయత్నిస్తుంటే... తన పదవిని కాపాడుకోవడానికి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీచుట్టూ తిరుగుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని అక్కడ తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. గతంలో రెండు లేదా మూడు గంటల కరెంట్ కోత మాత్రమే ఉండేదనీ... ఇప్పుడు కిరణ్ పాలనలో రెండు లేదా మూడు గంటలు మాత్రమే కరెంటు వస్తోందని ఆమె విమర్శించారు.

సీఎంకు ముందుచూపు లేనందువల్లే విద్యుత్, సాగునీటి కష్టాలు ఎదురయ్యాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజికన్నా తక్కువ స్థాయికి నీటి మట్టం పడిపోవడానికి కారణం ప్రభుత్వ వైఖరేననీ, చివరకు ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుందని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ఇప్పటివరకూ స్పష్టత లేనందున విద్యార్థుల్లో అయోమయం నెలకొందన్నారు. రాష్ట్రం నుంచి 30 మంది ఎంపీలు, కేంద్ర మంత్రులున్నా మనకు రావాల్సిన విద్యుత్ వాటాగానీ, నిధులు గానీ సాధించుకోవడంలో విఫలమయ్యారని ఆక్షేపించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు అధికార పక్షంతో కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు.

కేజీబేసిన్గ్యాస్‌‌ కోసం పోరాడిన వైఎస్

కేజీ బేసిన్‌లో రిలయన్స్ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌ను ముందుగా రాష్ట్రానికి ఇచ్చిన తరువాతనే ఇతర చోట్లకు తీసుకెళ్లాలంటూ పోరాడిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డే అని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. వైయస్ పాలించిన ఐదేళ్లూ వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్‌ను నిరాఘాటంగా ఇచ్చారని, ఇపుడా పరిస్థితి లేదని చెప్పారు. కుల, మత, వర్గ విభేదాలు లేకుండా సంక్షేమ పథకాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో సంతృప్త స్థాయి ప్రాతిపదికగా రాష్ట్ర ప్రజలకు వైయస్ లబ్ధి చేకూర్చారనీ, ఇపుడేమో తమకు ఓట్లేసిన వారికే పథకాలు ఇస్తామనే పాత విధానాన్నే మళ్లీ తెస్తున్నారని ఆయన విమర్శించారు.

కొండను తవ్వి చీమను పట్టారు

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం చేసిన హడావుడిని గొల్ల బాబూరావు విమర్శించారు. వీరు కొండను తవ్వి ఎలుకను కాదు, చీమను పట్టారని ఎద్దేవా చేశారు. దళితులు, బడుగులు వై.యస్.జగన్మోమోహన్‌రెడ్డి పక్షాన ఉండటంతో వారిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతోందన్నారు. అందులో భాగంగానే ఉప ప్రణాళిక నిధుల వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చిందని చెప్పారు. ఇవన్నీ దళితుల ఓట్ల కోసం కోస్తున్న కోతలు తప్ప మరేమీ కాదన్నారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, జి.బాబూరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కె.శ్రీనివాసులు, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, బి.గురునాథ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top