వేంపల్లె: రాష్ట్ర ప్రభుత్వంపై వైయస్ఆర్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మండిపడ్డారు. తెలుగుదేశం లాంటి కిరణ్ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉందని వ్యంగ్యంగా అన్నారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా మహానేత తనయ షర్మిల పాదయాత్ర గురువారం సాయంత్రం 6.30 గంటలకు కడప జిల్లా వేంపల్లకు చేరింది. అక్కడ స్వాగతం చెప్పిన అశేష ప్రజవాహినిని ఉద్దేశించి ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు. పాలక, ప్రతిపక్షల కుట్ర కారణంగా జైలుపాలైన జగన్ రాలేడు కాబట్టి షర్మిలను యాత్రకు పంపిస్తున్నాననీ, ఆమెను ఆశీర్వదించమనీ కోరారు. మీ కూతురిగా, మనవరాలిగా, చెల్లిగా, అక్కగా ఆమెను మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలలో కనీసం సమస్యలను కూడా ప్రస్తావించలేకపోయాం అందుకే ఇప్పుడు పాదయాత్రకు బయలుదేరామని తెలిపారు. తొమ్మిదేళ్ళ క్రితం మహానేత రాజశేఖరరెడ్డి ప్రజలకు భరోసా కల్పించడానికి పాదయాత్ర చేశారన్నారు.
మహానేత మరణానంతరం జగన్ బాబు నెలకు 25 రోజులు ప్రజలతోనే గడిపారని విజయమ్మ చెప్పారు. మీరాయనను కుమారుడిగా, తమ్ముడిగా, అన్నగా ఆదరించారు. 'లోక్‌సభ ఎన్నికలలో ఆయనకు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చారు. పులివెందులలో నాకు ఎప్పుడూ లేనంత ఆధిక్యత ఇచ్చారు. ఆ రకంగా జగన్ నాయకత్వాన్ని మీరంతా అంగీకరించారు.' అని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్, సీబీఐ కలిసి కుమ్మక్కయ్యి జగన్‌ను జైలులో పెట్టాయని ధ్వజమెత్తారు. విచారణకని తీసుకెళ్ళి అరెస్టు చేశారన్నారు. సాక్షుల్ని బెదిరిస్తాడని జైలులో పెట్టామన్నారనీ కానీ జనంలో ఆయన పట్ల అభిమానం పెరిగిపోతుందని భయంతో ప్రభుత్వం అరెస్టు చేయించిందనీ ఆమె మండిపడ్డారు. 140 రోజులైనా బెయిలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెయిలు పిటిషన్ ముందు రోజు చార్జిషీటు వేస్తూ అడ్డుపడుతున్నారని విమర్ఙంచారు. జైలులో కూడా జగన్ మీ గురించే తపన పడుతున్నారని చెప్పారు.
అన్ని సమస్యలకూ స్పందించిన ఏకైక నాయకుడు
జగన్ రాష్ట్రంలో అన్ని సమస్యలకూ స్పందించిన ఏకైక నాయకుడని విజయమ్మ కితాబిచ్చారు. విద్యార్థుల కోసం, నది జలాల్ల వాటా కోసం, నిత్యావసరాల కోసం ఇలా వివిధ అంశాలపై దీక్షలు చేశారన్నారు. ఈ నెల 5న బెయిలు లభిస్తుందని భావించి పాదయాత్రకు అంతా సిద్ధం చేసుకున్నారన్నారు. బెయిలు వచ్చి ఉంటే ఆయన ఈరోజు మీముందుండేవాడన్నారు. బెయిలు రాలేదని తెలిసిన వెంటనే.. 'ప్రజల మధ్యలో మనం ఉండాల్సిన అవసరం ఉంది.. బాధల్లో ఉన్నా వారి మధ్యకు మనం వెళ్ళాలని' జగన్ కోరారని చెప్పారు. కాళ్ళ నొప్పుల కారణంగా నేను పాదయాత్ర చేయలేనంటే షర్మిల యాత్రకు ముందుకొచ్చిందన్నారు. ఎప్పుడు బెయిలు లభిస్తే అప్పడు జగన్ మీముందుకు వస్తాడన్నారు.
చక్రం తిప్పానంటున్న బాబుకు సమస్యలు కనిపించలేదు
ప్రస్తుతం చంద్రబాబు కూడా పాద యాత్ర చేస్తున్నారనీ, అప్పట్లో కనిపించని సమస్యలు ఇప్పుడాయనకు కనిపిస్తున్నాయనీ ఆమె ఎద్దేవా చేశారు. ఆయనకంత శక్తి ఉంటే రైతుల ఇబ్బందులు, ఇతర సమస్యలు కనిపించలేదా అని ప్రశ్నించారు. రైతాంగానికి ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇప్పించలేకపోయారని నిలదీశారు. రాజశేఖరరెడ్డి ప్రధానితో మాట్లాడి ప్రత్యేక ప్యాకేజీ ఇప్పించారనీ, ఆరోజు రైతుల అప్పులన్నీ కట్టారనీ చెప్పారు. కర్ణాటకలో, మహరాష్ట్రలో నీటి ప్రాజెక్టులు కడుతున్నారనీ అంతకు ముందే మనం కట్టాలని మహానేత చెబితే పట్టించుకోలేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులకు బదులు రాష్ట్రంలో ఇంకుడు గుంతలు కట్టాకరన్నారు.
ఉచిత విద్యుత్తు అసాద్యమనీ, ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందన్న బాబు.. ఆరోజు ఇచ్చి ఉంటే అధికారంలోకి వచ్చి ఉండేవాడిననడం ఎంత సమంజసమని ప్రశ్నించారు. రామారావు ప్రవేశపెట్టిన రూ. రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని నీరు గార్చారనీ, మద్య నిషేధం పెడతానని బెల్టు షాపులు ప్రవేశ పెట్టిన బాబు ఈ రోజు రుణ మాఫీ చేస్తానంటు నమ్మేదెలాగన్నారు. ఆయన హయాంలోనే గ్యాసు ధర విపరీతంగా పెరిగిపోయింన్నారు. మైక్రో ఫైనాన్సు అని రుణాలిచ్చి ఎందరో మహిళల ఇబ్బందులకు కారణమయ్యాడన్నారు. రాజశేఖరరెడ్డి రైతన్నలకు రూ. 1300 కోట్ల బకాయిలు రద్దు చేశారని గుర్తుచేశారు. నేతన్నలను ఆదుకున్నారని చెప్పారు. తన హయాంలో కరెంటు బిల్లు పెంచనన్న మాటకు కట్టుబడిన విషయాన్నీ ఆమె జ్ఙాపకం చేశారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారనీ, రాజీవ్ ఆరోగ్యశ్రీతో పేదలకూ కార్పొరేట్ వైద్యం అందించారనీ, 108, 104 సేవలను అందించారనీ విజయమ్మ వివరించారు. ఫీజు రీయింబర్సుమెంట్ ప్రవేశపెట్టి పేదవాడికి ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చారన్నారు. కరెంటు లోటు లేకుండా చేశారనీ, ఇప్పుడు ప్రభుత్వం చేతులు ముడుచుకుని చూస్తోందనీ మండిపడ్డారు. గ్యాస్ మీద కేంద్రం ఆంక్షలు విధించినపుడు వైయస్ఆర్ కల్పించుకుని గ్యాస్ రప్పించి విద్యుత్తు ప్రాజెక్టులకు ఇబ్బంది లేకుండా చేశారన్నారు. 'వృద్ధాప్యపు పింఛనను 70నుంచి 200కు పెంచారు. వికలాంగ పింఛను రూ. 500 ఇచ్చారని' చెప్పారు. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామంటున్న ప్రభుత్వం 104, 108 సర్వీసుల ఉద్యోగులను ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్సుమెంటుపై ఆంక్షలు పెట్టి.. విద్యార్థులు తల్లిదండ్రులను మానసిన క్షోభ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీ లేని రుణాలిస్తాననీ ప్రస్తుత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇంతవరకూ ఉత్తర్వులు వెలువడలేదన్నారు. ఈ మొద్దు ప్రభుత్వాన్ని ఎలా నిద్ర లేపాలో అర్థం కావడం లేదన్నారు. ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టరు:
బాబుకు విజయమ్మ ప్రశ్న
ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టనని చంద్రబాబు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ తో కలవకుండా ఉన్నప్పుడు మిన్నకుండి కలిసిన అవిశ్వాసం పెట్టారని ఇదే వారు కుమ్మక్కయ్యారనడానికి తార్కాణమని విజయమ్మ చెప్పారు. 'చంద్రబాబు అన్నీ అబద్ధాలు చెబుతాడు.. ఆయన మాటలు నమ్మకండి.' అని విజ్ఙప్తి చేశారు. గతంలో జగన్‌ను మీకు అప్పగించా.. ఇప్పుడు షర్మిలను అప్పజెబుతున్నాన్నన్నారు. కడప జిల్లాలో వర్షంలేక చీని చెట్లు ఎండిపోతున్నాయనీ, నీరందించేందుకు చర్యలు తీసుకోమని కలెక్టరును కోరితే ప్రభుత్వానికి లేఖ రాశామని బదులిచ్చారు తప్ప ఏ చర్య తీసుకోలేదని ధ్వజమెత్తారు. చర్య చేపట్టకపోవడం వల్ల 500 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. కాలువకు 2 టీఎంసీల నీరివ్వాలని కోరితే ఓక టీఎంసీ కూడా ఇవ్వలేదని ఆవేదన చెందారు. జగన్ బాబు రాజ్యంలో రాజన్న రాజ్యం వస్తుందని విజయమ్మ స్పష్టం చేశారు.