టీడీపీ కక్ష సాధింపు రాజకీయాలు

  • కృష్ణా జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు 
  • రోజా, జోగి రమేష్, ఉదయభానులపై 3 మండలాల్లో  కేసులు నమోదు
విజయవాడ: అధికార తెలుగు దేశం పార్టీ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలోని నందిగామ, వీరులపాడు, చందర్లపాడు మండలాల్లోని అల్లూరు, పెద్దాపురం, చందర్లపాడు, నెక్కలంపాడు గ్రామాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, పార్టీ సీనియర్‌ నేతలు జోగిరమేష్, సామినేని ఉదయభాను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముగ్గుల పోటీలకు మహిళల నుంచి విశేష స్పందన రావడంతో జీర్ణించుకోలేని టీడీపీ నేతలు గ్రామ సభల్లో గొడవలు సృష్టించారు. దీంతో పెద్దాపురం గ్రామంలో 144 సెక్షన్‌ విధించారు. అంతేకాకుండా ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని నందిగామ, వీరులపాడు, చందర్లపాడు మండలాల పోలీసు స్టేషన్లలో టీడీపీ నేతలతో మంత్రి దేవినేని ఉమా ఫిర్యాదు చేయించారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు ఏ1 నిందితురాలిగా ఎమ్మెల్యే రోజా, ఏ2గా జోగి రమేష్, ఏ3గా సామినేని ఉదయభాను, ఏ4 నిందితులుగా జగన్‌మోహన్‌రావు, ఏ5 నిందితులుగా అరుణ్‌కుమార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుపై సామినేని ఉదయభాను, అరుణ్‌కుమార్‌ నేతృత్వంలో ఆయా నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలు తలపెట్టి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

ఉమా..కక్షసాధింపు చర్యలు మానుకో
వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత జోగి రమేష్‌

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా కక్ష సాధింపు  చర్యలు మానుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జోగి రమేష్‌ హితవు పలికారు.  మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తనతో పాటు తమ పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, రోజా, జగన్‌మోహన్‌రావు, అరుణ్‌కుమార్‌లపై తప్పుడు కేసులు బనాయించారని మండిపడ్డారు. నందిగామ పర్యటనలో అసలు ఎక్కడైనా గొడవలు జరగలేదని, ఉద్దేశపూర్వకంగా తమపై అక్రమ కేసులు బనాయించారని నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా అని నిలదీశారు. వైయస్‌ జగన్‌పై ఇష్టారాజ్యంగా మాట్లాడిన టీడీపీ నేతల మీద కేసులు ఎందుకు పెట్టలేదని, చట్టం మీకు చుట్టమా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని జోగిరమేష్‌ హెచ్చరించారు.
 
Back to Top