అధికారమదంతో దాష్టీకాలు
కిడ్నాప్లు, ప్రలోభాలతో తెలుగుదేశం శివాలు
న్యాయం కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం వృథా
పట్టించుకోని గవర్నర్, ఎన్నికల సంఘం

హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇచ్చి కొనుగోళ్లు జరిపి అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ అదే అవినీతి పోకడలను ఆంధ్రప్రదేశ్లోనూ కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్లో ఏకంగా ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేసి శిబిరాలు నిర్వహించే స్థితికి దిగజారింది. గెలుపు కోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధమేనని మరోమారు నిరూపించుకుంది. అధికారమదంతో తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాష్టీకాలకు ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తాయి. అక్కడ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. న్యాయం కోసం అలుపెరుగని పోరాటం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ చివరకు ఈ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. ఎన్ని ఆందోళనలు చేసినా గవర్నర్కు, ఎన్నికల సంఘానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడంతో పార్టీ ఆ నిర్ణయానికి వచ్చింది.

వీడియో క్లిప్పింగుల్లో దొరికినా...
బలం లేకపోయినాప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలన్న దుగ్ధతో తెలుగుదేశం పార్టీ చేయని అకృత్యం లేదు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్కి చెందిన 35 మంది ఎంపీటీసీ, జడ్పీటీసీలను కిడ్నాప్ చేసి గుర్తు తెలియని ప్రదేశంలో నిర్భందించారు. ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టారు. జడ్పీటీసీలను, ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేస్తూ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీడియో క్లిప్పింగులు దొరికాయి కూడా. అయినా అధికార పార్టీ ఆగడాలను అడ్డుకునేవారే లేకపోయారు. ప్రకాశం జిల్లాలో అధికారులు, పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరించడం దురదృష్టకరం. అధికార పార్టీకి అధికారులు, పోలీసులు అనుకూలంగా వ్యవహరించడం సర్వ సాధారణంగా కనిపించేదే అయినా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికార యంత్రాంగాన్ని, పోలీసులను స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్న తీరు మాత్రం అత్యంత ఆక్షేపణీయం.

తమిళనాడుకు తరలించారు...
అధికారులు, పోలీసులు కూడా అధికార పార్టీకి కొమ్ముకాయడం విచారకరం. ఎంపీటీసీలు, జడ్పీటీసీలను అపహరించడానికి పోలీసులు సహకరించడం మరింత దుర్మార్గం. సరిగ్గా వారంరోజుల క్రితం నెల్లూరులో వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీకి చెందిన 35 మంది ఎంపీటీసీ, జడ్పీటీసీలను తెలుగుదేశం పార్టీ నాయకులు కిడ్నాప్ చేసి ఒక హోటల్ లో నిర్బంధించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి, పి. అనిల్కుమార్యాదవ్ వెళ్లి వారిని విడిపించడం ప్రపంచమంతా చూసింది. అలా విడిపించిన ప్రజాప్రతినిధులు పోలీసుల రక్షణలో ఉన్నారు. ఉదయాన్నే వారిని ఇళ్లకు పంపిస్తామని చెప్పిన పోలీసులు ఆ తర్వాత అందరినీ తమిళనాడుకు పంపించేశారు. స్థానిక పోలీసులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చెప్పినట్లే నడుచుకోవడం, ఆయన చెప్పిన చోటకు ప్రజాప్రతినిధులను తరలించడం బహిరంగ రహస్యమే.

దొంగే దొంగా అన్నట్లుంది...
వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులను అపహరించడమే కాకుండా వైఎస్ఆర్సీపీపైనే తప్పుడు ప్రచారాలకు దిగడం మరింత హేయమైన చర్య. అధికారపార్టీ తొత్తులా వ్యవహరించే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ ముందుగానే వైఎస్ఆర్సీపీపై దుష్ర్పచారాలకు దిగింది. కర్నూలు - ప్రకాశం జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి వైఎస్ఆర్సీపీ వైదొలగినట్లు తప్పుడు వార్తలు ప్రసారం చేసింది. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా అవినీతి చర్యలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా తన అనుకూల చానెల్ అయిన ఏబీఎన్ ద్వారా దిగజారుడు ప్రచారాలకు దిగింది. ఏబీఎన్ దుష్ర్పచార వార్తలపై వైఎస్ఆర్సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కూడా. ఇదే కాదు కర్నూలులో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులను అపహరించి తెలంగాణలో క్యాంపు నిర్వహిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీపై అభూతకల్పనల కథనాలను కూడా ఏబీఎన్ ప్రసారం చేసింది.

గవర్నర్, ఈసీలకు విజ్ఞప్తులు నిష్ఫలం..
తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను అపహరించి శిబిరాలు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ దుర్మార్గాలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు, రాష్ర్ట ఎన్నికల కమిషనర్కు వైఎస్ఆర్సీపీ పలుమార్లు విజ్ఞాపనలు అందించింది. తమవారిని తెలుగుదేశం పార్టీ చెర నుంచి విడిపించే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నర్కు, ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. తమ ప్రజాప్రతినిధులను అజ్ఞాతంలో నిర్బంధించిన సమయంలో తాము ఎన్నికల్లో ఎందుకు పాల్గొనాలని వారు గవర్నర్ను ప్రశ్నించారు. విజ్ఞాపనలను పరిశీలిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన గవర్నర్గానీ, ఎన్నికల సంఘం గానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అధికార పార్టీ అక్రమాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఒంగోలులో నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట నిరసనగా ధర్నాచేశారు.

ఎన్ని ఆందోళనలు చేసినా, ఎన్ని విజ్ఞాపనలు అందించినా రాక్షసరాజ్యంలో న్యాయం ఆశించడం అత్యాశే అవుతుందన్న సూత్రమే నిజమయ్యింది. అందుకే ఈ ఎన్నికలను బహిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.