టీడీపీ ఎంపీలే ఉక్కా.. తుక్కా అంటున్నారు

శనివారం,
30–06–2018 


ముమ్మిడివరం, తూర్పుగోదావరి జిల్లా  శ్రీ
భద్రకాళీ సమేత మురుముళ్ల వీరేశ్వర స్వామికి నిత్యకళ్యాణం జరిగే చోటు.. పరవశింపజేసే
కోరంగి అభయారణ్యం ఉండే గడ్డ.. దేశంలోనే రెండో అతిపెద్ద మడ అడవులున్న ప్రాంతం..
ముమ్మిడివరం. వనరులన్నీ ఉన్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండటం విషాదం. గోదారమ్మ...
గౌతమి, వృద్ధ
గౌతమి పాయలుగా ప్రవహించే ఈ నియోజకవర్గం.. తీర ప్రాంతాలు, లంక గ్రామాలకు నెలవు.
వీటిని కలుపుతూ నాన్నగారు ప్రారంభించిన వంతెనల పనులు ఆగిపోయి ఎక్కడ వేసిన గొంగళి
అక్కడే అన్న చందాన మిగిలిపోవడం బాధించింది. దానివల్ల ఇప్పటికీ నాటుపడవలే లంక
గ్రామాలకు ప్రధాన రవాణా సాధనాలుగా ఉండటం విచారకరం. గోదారమ్మ ప్రవహిస్తున్న ఈనేలపై
మంచినీరు అందక జనం తల్లడిల్లటం బాధాకరం. 

దళితతేజం
ఓ బూటకపు నాటకమన్నాడు ఉప్పలగుప్తానికి చెందిన వెంకటేశ్వరరావు. దళితులకు ఇన్నోవా
కార్లను ఇచ్చి దళితతేజం పెంచేస్తామని చెప్పిన పాలకులు అర్హులైన వారికి మాత్రం
ఇవ్వడంలేదట. ఇచ్చే అరకొర సైతం పచ్చ నాయకుల దగ్గర పనిచేసే అమాయకపు దళిత బిడ్డల
పేరిట తీసుకుని బడాబాబులు షికార్లు చేస్తున్నారట. కడుపు నిండినవాడే పేదవాడి
నోటికాడి కూటిని కొట్టేయడమంటే ఇదే అని వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పీహెచ్‌డీ
చేస్తున్న జైభీం చంద్ర.. దళితుల విషయంలో సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగట్టాడు.
ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఇస్తున్న కొద్ది పాటి లోన్లూ జన్మభూమి కమిటీల సిఫారస్‌ల
మేరకే ఇస్తున్నారు.. ఇదెక్కడి దుర్మార్గమంటూ బాధపడ్డాడు. దళితవాడల్లో బసచేయడం, దళితుల ఇళ్లల్లోనే భోజనం
చేయడం, వారి
సమస్యలను తక్షణం పరిష్కరించడం.. ఇదీ దళిత తేజం అని గొప్పగా చెప్పుకున్నారు అధికార
పార్టీ పెద్దలు. కానీ హాట్‌ ప్యాక్‌లలో భోజనం.. మొక్కుబడిగా కార్యక్రమాల్లో
పాల్గొనడం, ఫొటోలు
దిగి మాయమవడం, అర్జీలను
మూలన పడేయడం.. ఇదీ వాస్తవ చిత్రం అన్నాడు ఆ సోదరుడు. చంద్రబాబు పాలనలో 648 సంక్షేమ హాస్టళ్లను
మూసేశారు. బడ్జెట్‌లో సబ్‌ప్లాన్‌ కోసం 17 శాతం నిధులు కేటాయించాల్సి
ఉండగా, ఏరోజూ
కేటాయించిన పాపాన పోలేదు. కేటాయించిన అరకొర నిధుల్లో 50–60 శాతానికి మించి ఏ
సంవత్సరమూ ఖర్చు చేయలేదు. దళిత తేజమంటే ఇదేనా? అని ఆ సోదరుడు
ప్రశ్నించాడు. 

చంద్రబాబు ఎవరినైనా, ఎవరి పేరునైనా వాడుకుని
వదిలేస్తాడనే దానికి బాలయోగి గారి విషయంలో చెప్పిన మాటలే సాక్ష్యం అన్నారు నన్ను
కలిసిన ఐపోలవరం సోదరులు. బాలయోగి గారి మరణానంతరం జరిగిన సభలో ఆయన స్వగ్రామం
ఎదుర్లంక రామాలయంపేటను మోడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్ది బాలయోగి రుణం తీర్చుకుంటానని
బాబుగారు వాగ్దానం చేశారు. ఆ తరువాత పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికీ ఆ
గ్రామానికి కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు. మంచినీటికీ గతిలేదు. రోడ్లు, మౌలిక వసతులు అసలే లేవు.
ఇంత చిన్న విషయమూ చేయకపోవడమన్నది దళితులపై, దళిత నేతలపై చంద్రబాబుకున్న
ప్రేమకు నిదర్శనం. అన్నంపల్లి ఆక్విడెక్ట్‌ కట్టించడం ద్వారా ఐపోలవరానికి మేలు
చేసింది మీ నాన్నగారే అంటూ గుర్తు చేశారు.  

కడప
ఉక్కు ఫ్యాక్టరీపై చంద్రబాబు గారు అకస్మాత్తుగా ఎక్కడ లేని ప్రేమ చూపించడం నిజంగా
విడ్డూరం. ఉక్కు పరిశ్రమ ఆలోచన, అంకురార్పణ నాన్నగారిదే. ఆరోజు కూడా
నిరాధార విమర్శలతో అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది బాబుగారే. విభజన హామీలలో తప్పక
నెరవేర్చాల్సిన ఉక్కు పరిశ్రమ స్థాపనను... ఎక్కడ నాన్నగారికి పేరొస్తుందో అన్న
దుగ్ధతో నాలుగేళ్లుగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఓవైపు ఉక్కు పరిశ్రమ
పూర్తి చేస్తామన్న ప్రైవేటు యాజమాన్యపు మైనింగ్‌ లీజు, భూ కేటాయింపునూ రద్దు
చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ఉక్కు కర్మాగారానికి భూ
కేటాయింపులు చేయకుండా, ముడి
ఖనిజపు సరైన లభ్యత చూపించకుండా ఉక్కు ఫ్యాక్టరీ కోసమంటూ దీక్షలు చేయించడం ప్రజలను
మభ్యపెట్టడానికే. బీజేపీని గట్టిగా అడిగితే ఎక్కడ స్వప్రయోజనాలు దెబ్బతింటాయో అన్న
భయంతో నాలుగేళ్లుగా ఆ ఊసే ఎత్తకుండా ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత..
ఎన్నికలకు ఆరు నెలల ముందు కడప ఉక్కు ఫ్యాక్టరీ అంటూ కపట నాటకానికి తెరతీశాడు
చంద్రబాబు.

అధికారంలోకి
వచ్చిన వెంటనే కడప ఉక్కు ఫ్యాక్టరీని పూర్తి చేస్తామని వైఎస్సార్‌సీపీ ప్రకటించేంత
వరకూ చంద్రబాబులో ఎటువంటి చలనమూ లేకపోవడం గమనార్హం. పొరుగు రాష్ట్రంలో కేంద్రం
ఏమడిగితే అది ఇస్తాం.. ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభించాలని అక్కడి ప్రభుత్వం గట్టిగా
అడుగుతుంటే.. ఇక్కడ మాత్రం చినబాబు మేము ఏమీ ఇవ్వమని భీష్మించు కోవడంలోనే ఉక్కు
ఫ్యాక్టరీ మాకు వద్దు అని చెప్పకనే చెబుతున్నారు. టీడీపీ ఎంపీలే ఉక్కా... తుక్కా..
అంటూ వ్యాఖ్యానించడం, ఆ
పార్టీ నేతల నిరాహార దీక్షలు బూటకమని ఎకసెక్కాలాడటం చూస్తే వారి చిత్తశుద్ధి
ఏపాటిదో ప్రజలందరికీ అర్థమవుతోంది. ప్రజలందరి ఆశీర్వాదంతో మనందరి ప్రభుత్వం
ఏర్పడిన మూడు సంవత్సరాలలో వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే కడప ఉక్కు ఫ్యాక్టరీని
పూర్తి చేసి ప్రారంభిస్తామని ఇంతకు మునుపే వైఎస్సార్‌సీపీ చెప్పిన మాట, దాన్ని చేసి చూపించాలన్నదే
నా సంకల్పం.

ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. మీ నాలుగేళ్ల పాలనలో గతంలో
ఎన్నడూ లేనంతగా దళితులపై దాడులూ, దౌర్జన్యాలు, అత్యాచారాలూ పెరిగిపోవడం
వాస్తవం కాదా? మీరు, మీ మంత్రివర్గ సహచరులూ, మీ పార్టీ నేతలూ దళితులను
చులకన చేస్తూ, దూషిస్తూ, అవమానిస్తూ మాట్లాడటం నిజం
కాదా? అట్టి
మీకు దళిత తేజం పేరుతో కార్యక్రమాలు చేసే అర్హత ఉందా?
   

-వైఎస్‌ జగన్‌ 

Back to Top