భూ కబ్జాలో మంత్రి, శాసనసభ్యుల హస్తం

  • ధనార్జనే ధ్యేయంగా టీడీపీ భూ కుంభకోణాలు
  • విశాఖలో కనీవినీ ఎరుగని రీతిలో భూ కబ్జాలు
  • భూదందాలపై సీబీఐ విచారణకు వైయస్సార్సీపీ డిమాండ్
  • విశాఖ భూముల కుంభకోణంపై రౌండ్ టేబుల్ సమావేశం
  • పోరాటాలకై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన విజయసాయిరెడ్డి
విశాఖపట్నంః జిల్లాలో జరిగిన లక్ష ఎకరాల భూ కబ్జాలో జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ శాసనసభ్యుల హస్తం ఉందని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ధనార్జనే ధ్యేయంగా భూ దందాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.   విశాఖలో కనివినీ ఎరుగని రీతిలో భూకుంభకోణాలు జరిగాయని,  మా జీవితంలో ఇలాంటి స్కాంలు చూడలేదని ప్రతి ఒక్కరూ చెబుతున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. భూ కబ్జా విశాఖ నగరంతో  పాటు జిల్లాలోని అనేక నియోజకవర్గాలకు ఇది విస్తరించిందని పేర్కొన్నారు.  భూదందాపై సీబీఐతో విచారణ జరిపించాలని విజయసాయిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ కుంభకోణానికి సంబంధించి వచ్చేనెల 14న విశాఖకు కేంద్రహోంమంత్రి రానున్న సందర్భంగా అన్ని పార్టీల నాయకులు ఐక్యంగా మెమొరాండం ఇద్దామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విశాఖలో భూ కబ్జాపై వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... లక్ష ఎకరాల భూ కబ్జా అయిందని స్వయంగా ఒప్పుకున్న కలెక్టర్ ఇప్పుడు మాట మార్చి  244 ఎకరాలే దోపిడీ జరిగిందని చెప్పడం తగదన్నారు. సీఎం కుమారుడు ఇక్కడకు వచ్చాక ఏం మంతనాలు జరిగాయో కలెక్టర్ మాట మార్చారన్నారు. 

ఇలాంటి భూ కబ్జాలు పునరావృత్తంకాకుండా కఠిన శిక్షలు విధించాలన్నారు. ఈనెల 15న జరగనున్న బహిరంగ విచారణలో పాల్గొని తమ వాణి వినిపిద్దామని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా మంత్రి తూతూమంత్రంగా బహిరంగ విచారణ జరిపించాలని చూస్తున్నారని,  దీని వల్ల బాధితులకు ఎలాంటి న్యాయం జరగదని విజయసాయిరెడ్డి అన్నారు.  సీఐడీ అనో, స్పెషల్ టీంతో విచారణ అనో దీన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. భూ కబ్జాపై సీబీఐ విచారణ జరగాలంటే కేంద్రానికి రిప్రజెంట్ చేయడమో, కోర్టులను ఆశ్రయించడం చేద్దామని అన్నారు. రాష్ట్రపతికి మెమొరాండం ఇద్దామని అన్నారు. గవర్నర్ చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తి కాబట్టి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. 

విలువైన భూముల రికార్డులు మాయమయ్యాయని ప్రభుత్వం మభ్యపెట్టి డైల్యూట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు. భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని....దీనిపై పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రజాసంఘాలు, పార్టీలపై ఉందని విజయసాయిరెడ్డి చెప్పారు. అధికారంలో టాప్ లో ఉన్న వారెవరు ట్యాంప్ చేయడానికి వీల్లేని వ్యవస్థను రూపొందించాలన్నారు. ఇండియన్ క్రిమినల్ , పీనల్ కోడ్ ను మార్చి పనిష్ మెంట్ సివియర్ పనిష్ మెంట్ కింద ఇస్తే భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఉంటాయన్నారు. 15న బహిరంగ విచారణలో పాల్గొని సమిష్టిగా మన వాణి వినిపిద్దామన్నారు. ఆలోపు భూ కుంభకోణాలు జరిగిన ప్రదేశాలు సందర్శించి బాధితులను నేరుగా పరామర్శించి వారి సమస్యలు తెలుసుకోవడం చేద్దామన్నారు. దీని తర్వాత ప్రభుత్వం మేలుకొనేలా భారీ ధర్నా చేపడుదామన్నారు. 
Back to Top