నెల్లూరు(జలదంకి): మండలంలోని బీకే అగ్రహారంకు చెందిన టీడీపీ నాయకులు మాదినేని రామానాయుడు, షేక్ పెద మస్తాన్‌లతో పాటు మరికొందరు వైయస్సార్సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాయకులు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఆద్వర్యంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ విధానాలు నచ్చక ప్రజలతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా విసిగిపోయారన్నారు. దీంతో అధిక శాతం ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేక భావనలో ఉన్నారన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు.
పేదల కోసం పక్కా లక్ష ఇళ్లు కట్టిస్తానన్న చంద్రబాబు ఇచ్చిన హామీని మర్చిపోయాడని అన్నారు. రాజధాని పేరుతో పేద రైతుల భూములను లాక్కుని అదిగో అమరావతి.. ఇదిగో రాజధాని అంటూ చంద్రబాబు రాష్ట్రాన్ని విదేశీ సంస్ధలకు తాకట్టు పెడుతున్నాడని దుయ్యబట్టారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా మాయ మాటలు చెబుతున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు వంటేరు రామచంద్రారెడ్డి, దయాకర్‌రెడ్డి, షేక్ హజరత్ తదితరులు పాల్గొన్నారు.