విద్యార్థుల జీవితాలతో చలగాటం

ఏపీ అసెంబ్లీ: విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చలగాటమాడుతోందని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీపై ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. నెల్లూరులో జనరల్‌ సైన్స్‌ పేపర్‌–1 ప్రశ్నపత్రం వాట్సప్‌ ద్వారా లీక్‌ అయినట్లు ఆ జిల్లా విద్యాశాఖాధికారి ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే ఇన్విజిలేటర్, సూపరిన్‌టెండెంట్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం సరికాదన్నారు. నారాయణ స్కూల్‌ యాజమాన్యం ప్రమేయం లేకుండా పేపర్‌ లీక్‌ కాలేదని అనుమానం వ్యక్తం చేశారు. ఇంటర్‌లో జంబ్లింగ్‌ వ్యవస్థ, సెంటర్లు మార్పు చేయడం వంటి చర్యలతో విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్నారని, అంతటితో ఆగకుండా నారాయణ సంస్థ విద్యార్థులకు మంచి ర్యాంకులు సాధించేందుకు పేపర్‌ లీకేజీకి పాల్పడటం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి, ప్రభుత్వ రూల్స్‌కు వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమాలపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సురేష్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఇసుక దందా, కల్తీ మద్యం, పేపర్‌ లీకేజీ  ఇలా ప్రతి ఒక్క అరాచకం వెనుక టీడీపీ నేతలు ఉన్నారని ఎమ్మెల్యే సురేష్‌ ఆరోపించారు.

Back to Top