పంటలకు తెలుగుదేశం తెగులు

అనంతలో రైతుల అవస్థలు
పట్టించుకోని అధికారులు, పాలకులు
వ్యవసాయశాఖ నిర్లక్ష్యం..రైతుల ఆగ్రహం

అనంతపురంః వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అనంతపురం జిల్లాలో దెబ్బతిన్నపంటలను పరిశీలించారు. ఈసందర్భంగా ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.  జిల్లాను కరువు రహిత జిల్లాగా చేస్తానని మహనీయుడు అబ్దుల్ కలాం సాక్షిగా చెప్పిన చంద్రబాబు...మాటలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. ఎంతసేపు హెలికాప్టర్లలో తుళ్లూరు చుట్టూ తిరగడం కాదని, అనంతలో లక్షలాది ఎకరాల్లో వేరుశనగ, పదుల హెక్టార్లలో పెసర పంటలు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

దక్షిణ భారతదేశానికి వంటనూనె అందించే అనంత జిల్లాలోని వేరుశనగ రైతుల మనుగడ కష్టతరంగా మారిందని నాగిరెడ్డి అన్నారు. వర్షాభావంతో పంటలను మేకలు, గొర్రేలకు వదిలేసిన దుస్థితి నెలకొందన్నారు. ప్రత్యామ్నాయంగా  ప్రత్తి,  పెసర, మినుము, కందులు వేసినా  రైతులను దురదృష్టం వెన్నాడుతుందన్నారు.  వైరస్ సోకడంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితిలో రైతులు ఉంటే...అధికారులు గానీ, పాలకులు గానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పప్పుధాన్యాలు లేక ధరలు మండుతుంటే వ్యవసాయ శాఖ అనంతలో పప్పుపంటలను ఆదుకోకపోవడం ఘోర తప్పిదమన్నారు. ఎకరాకి 20 వేల రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.  

మాటలు చెప్పడం కాదని...చిత్తశుద్ధితో కార్యక్రమాలు చేయాలని నాగిరెడ్డి చంద్రబాబుకు హితవు పలికారు.  రైతులకు ఇప్పటివరకు గతేడాది ఇన్ పుట్ సబ్సిడీ కూడా చెల్లించలేదని మండిపడ్డారు.  కరువు మండలాలకు రాయితీ ఇవ్వలేదని, కనీస మద్దతు ధర ప్రకటించడం లేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పంట పండించడమే గగనమైతే, పండించిన ధాన్యానికి గిట్టుబాటు లేక రైతులు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా... ఎక్కడ కూడా నష్టపోయిన పంటలను గానీ, రైతులను గానీ ముఖ్యమంత్రి పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  

Back to Top