- దున్నపోతుమీద వానపడినట్లుగా ప్రభుత్వ వైఖరి
- విధ్వంసం సృష్టించడంలో టీడీపీ తరువాతే ఎవరైనా
- బాబు, లోకేష్ ల దగ్గర కుట్రబుద్ధులు మెండుగా ఉన్నాయి
- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
గుంటూరుః అన్నపూర్ణ ఆంధ్రరాష్ట్రంలో రైతు పరిస్థితి నానాటికి దిగజారిపోతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి, పసుపు, సుబాబులు, కంది ఏ వ్యవసాయ ఉత్పత్తికి గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పోసి తగలబెట్టుకుంటున్నారన్నారు. రైతుల కన్నీటి ఆవేదనను దృష్టిలో పెట్టుకొని వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రైతుదీక్షకు పూనుకున్నారని స్పష్టం చేశారు. అయినా దున్నపోతు మీద వానపడినట్లుగా చంద్రబాబు రైతులపై ఆలోచన చేయకుండా దీక్షను ఏ విధంగా అణచివేయాలనే కుట్రలు పన్నుతున్నారని అంబటి మండిపడ్డారు. గుంటూరు దీక్ష వేదిక వద్ద అంబటి రాంబాబు మాట్లాడుతూ... మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పరిపాలనలో రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుందన్నారు. ఇన్‌పుట్ ఖర్చులు తగ్గించి రైతుల పంటలకు మద్దతు ధర కల్పించి ఆదుకున్న మహానుభావుడు వైయస్ఆర్ అని కొనియాడారు. కానీ చంద్రబాబు పరిపాలననలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందన్నారు.
రైతుల కోసం కడుపు మాడ్చుకొని దీక్ష చేస్తున్న వైయస్ జగన్
కడుపు మాడ్చుకొని రైతులకు మద్దతు ధర కల్పించాలని ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేస్తుంటే టీడీపీ మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డిలు కుట్ర అనడాన్ని అంబటి ఖండించారు. ప్రభుత్వమే ఆ ముసుగులో హింసను సృష్టించి అది వైయస్ జగన్ నెత్తిన రుద్దడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అలాంటి కుట్రబుద్ధులు చంద్రబాబు, లోకేష్‌ల దగ్గర మెండుగా ఉన్నాయన్నారు. ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తుంటే తునిలో రైలు తగలబెట్టింది తెలుగుదేశం పార్టీ నాయకులేనని అందరికీ తెలిసిన సత్యం అన్నారు. ఇప్పటి వరకు రైలు ఘటనపై ఎన్నో విచారణలు చేపట్టారు. ఒక్క విచారణలో కూడా ఎవరినీ అరెస్టు చేయలేదు అంటే దానర్థం తెలుగుదేశం నేతలే చేసి కాపులపై తోశారని కాదా.. అని చంద్రబాబును ప్రశ్నించారు. రైతు దీక్షలో కూడా ఏదో విధ్వంసం సృష్టించి వైయస్ జగన్‌పై రుద్దాలని చూస్తున్నారన్నారు. మే డే సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆరుగాలం శ్రమిస్తున్న నెంబర్ కూలీని నేనే అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏదైనా సన్మానం చేయాలనుకుంటే నాకు చేయండి అనడం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగానే చంద్రబాబు నెంబర్ వన్ కూలీ అని ఆయన ప్రయాణం చేయాలంటే ప్రత్యేక విమానం కావాలి.... ఉండాలంటే సెవన్‌స్టార్ హోటల్, లింగమనేని గెస్ట్‌హౌస్, హైదరాబాద్‌లో అంబానీని తలదన్నె ఇళ్లు కట్టుకున్న చంద్రబాబు నిజంగానే నెంబర్ వన్ కూలీ అని ఎద్దేవా చేశారు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో తరతరాలు గుర్తండేలా ప్రజలు బాబుకు సన్మానం చేస్తారని హెచ్చరించారు.