దమ్ముంటే చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయాలి: తమ్మినేని

మంగళగిరి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష చేయాల్సింది విజయవాడ బెంజి సర్కిల్లో కాదని.. దమ్ముంటే ఢిల్లీలో ఇండియా గేటు వద్ద చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం సవాలు చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళగిరిలో రెండు రోజుల పాటు చేస్తున్న 'సమరదీక్ష' వేదిక వద్ద ఆయన ప్రసంగించారు. ఆత్మగౌరవాన్ని, అవినీతిని ముడిపెట్టి బాబు మాట్లాడుతున్నారన్నారు. మీ అవినీతితో ఎన్టీ రామారావును మభ్యపెట్టి, వెన్నుపోటు పొడిచారని, ప్రపంచంలోనే తెలుగువాళ్లను అవినీతిపరులుగా చూసేందుకు మీరే కారణమని విమర్శించారు. నువ్వసలు అన్నమే తింటున్నావా.. ఇంకేం తింటున్నావంటూ దునుమాడారు. అసలు ఎందుకు బతుకుతున్నావని నిలదీశారు. ఇంకా ముఖ్యమంత్రిగా ఎందుకు ఉన్నావని అడిగారు. ఇక వెంకయ్యనాయుడు గతంలో రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు కాదు.. పదేళ్ల ప్రత్యేక హోదా కావాలని అన్నారని, కానీ ఇప్పుడు అసలు ప్రత్యేక హోదా అవసరం లేదంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇక గతంలో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన మత ఘర్షణల సమయంలో.. మోదీని ఉరి తీయాలని, దేశ బహిష్కరణ విధించాలని అన్న పెద్దమనిషి.. ఇప్పుడు మాత్రం ఆయన గేటు దగ్గర కాపలా కూర్చున్నాడని సీతారాం విమర్శించారు.

ఎన్నికల సమయంలో చంద్రబాబు ఒళ్లు మరిచి వాగ్దానాలు చేశారని తమ్మినేని సీతారాం గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో రైతులు తమను రుణమాఫీ గురించి అడిగినప్పుడు వైఎస్ జగన్ను అడిగితే.. నిధులు చాలవు, ఇవ్వలేమని చెప్పడమే కాక ప్రజలు దయదలచి ఓట్లు వేస్తే గెలుస్తాం, లేకపోతే లేదని నిర్భీతిగా చెప్పారని ఆయన అన్నారు. ఇలా నీతి, నిజాయితీలకు నిలబడే నాయకుడు కావాలా.. వెన్నుపోటు పొడిచే చంద్రబాబు కావాలా అని ప్రజలను అడిగారు.
Back to Top