తాను తవ్విన గోతిలోనే పడిన కాంగ్రెస్

తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా),

21 మే 2013: మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్ఐఆర్‌లో దోషి అని చేర్చినప్పుడు, ఆయన అందించిన పదవులు అనుభవిస్తున్న మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు చోద్యం చూశారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. రాజశేఖరరెడ్డి కొడుకు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి మీద కేసులు పెట్టి, జైలుకు పంపిస్తుంటే వీళ్ళంతా వేడుక చూశారు.. చప్పట్లు కొట్టారని దుయ్యబట్టారు. ఆ కేసులు తమ మీదకు వచ్చేసరికి గిలగిలా కొట్టుకుంటున్నారని శ్రీమతి షర్మిల విమర్శించారు. జిఓలన్నీ సక్రమమే, రాజశేఖరరెడ్డి వత్తిడేమీ లేదు, ఆయన పెట్టమంటే సంతకాలు పెట్టలేదని మంత్రులు ఈ రోజు ఒప్పకుంటున్నారని ఆమె అన్నారు. ఈ విషయం ఆనాడే చెప్పి ఉంటే అసలు ఈ కేసే లేకుండా పోయేది అన్నారు. తాము తవ్విన గోతిలో వారే పడుతుంటే.. జిఓలన్నీ సక్రమమే, ఇదంతా కేబినెట్‌ సమష్టి నిర్ణయమే అనడాన్ని ఆమె ప్రస్తావించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 155వ రోజు మంగళవారంనాడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పోలీసు ఐలాండ్సు వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

ఆ రోజు 26 జిఓల కేసులో జగనన్న 52వ ప్రతి వాది అని, మంత్రులు, అధికారులు ఒకటి నుంచి 15వ ప్రతివాదులుగా కోర్టు పేర్కొంటూ నోటీసులు ఇచ్చిందని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఆ రోజున కాంగ్రెస్‌ ప్రభుత్వం అస్సలు రెస్పాండే కాలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు మంత్రుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంటే..  ఆ జిఓలలో అసలు అక్రమం, క్విడ్‌ ప్రో కో, ఏ అవినీతీ జరగలేదని, నిబంధనల ప్రకారం అర్హులైన వారికే భూములు ఇచ్చినట్లు మంత్రులు ఒప్పుకుంటున్నారన్నారు. ఇదే సమాధానం ఆ రోజే చెప్పి ఉంటే అసలు ఈ కేసు నిలబడేదే కాదన్నారు. కానీ, జగనన్నను ఎలాగైనా ఇరికించాలని, అడ్డు తొలగించాలని ఈ మంత్రులు ఆ రోజు అనుకున్నారన్నారు.

అవినీతి, కళంకిత మంత్రులు అని తమను విమర్శిస్తుంటే బాధగా ఉందని నిన్న ధర్మాన ప్రసాదరావు, సబితమ్మ ఆవేదన వ్యక్తం చేయడాన్ని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. నేరం నిరూపితం కాకుండానే తమను అవినీతి మంత్రులు అనడం సబబు కాదన్నారన్నారు. జగనన్న దోషి అని, నేరం చేశారని ఏ కోర్టు చెప్పింది అని ఆమె ప్రశ్నించారు. జగనన్న దోషి అని ఏ కోర్టూ చెప్పకుండానే జగనన్నకు 14 ఏళ్ళ శిక్ష పడుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అనడమేమిటని శ్రీమతి షర్మిల నిలదీశారు. మరో నీతిమాలిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అయితే జగనన్నను ఉరితీయాలని, వైయస్‌ కుటుంబాన్ని వెలివేయాలని అనడాన్ని తీవ్రంగా ఖండించారు. అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మాకు మనసు ఉండదా, బాధ కలగదా? అని ఆమె ప్రశ్నించారు. ఏనాడూ సెక్రటేరియట్‌కు వెళ్ళని, పలానా పని చేయమని ఏ మంత్రినీ అడగని జగనన్నకు ఆ జిఓలతో ఏమి సంబంధం అని ప్రశ్నించారు.

జగనన్నను అడ్డు తొలగించుకోవాలని కాంగ్రెస్‌, టిడిపి నాయకులు కుట్రలు పన్ని, కేసులు పెట్టి, జైలుకు పంపడాన్ని శ్రీమతి షర్మిల విమర్శించారు. మూడేళ్ళుగా వీళ్ళు పాల్పడింది కుమ్మక్కు కాదా అన్నారు. కాంగ్రెస్‌ చేతిలో సిబిఐ కీలుబొమ్మ అని, అది ఎక్కడ మొరగమంటే అక్కడ మొరుగుతుందని, ఎవరిని కరవమంటే వారిని కరుస్తుందని ఎద్దేవా చేశారు.‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఇరికించాలని, జైలుకు పంపించాలని, బెయిలు రాకుండా చేయాలన్న కుట్రతో కాంగ్రెస్‌, టిడిపిలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని ఆమె ఆరోపించారు. జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం వారికి లేనేలేవన్నారు. అందుకే కుట్రలు పన్ని, నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి అంటే మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిలా ఉండాలి. విద్యార్థుల కోసం కన్న తండ్రి స్థానంలో వైయస్‌ ఆలోచించారు కనుకే ఎంతో మంది ఉన్నత చదువులు చదివి మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పేదలకు కూడా కార్పొరేట్‌ వైద్యం అందించాలని ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారన్నారు. అభయహస్తం, ఉపాధి హామీ లాంటి ఎన్నో పథకాలు తీసుకువచ్చారన్నారు. ఎన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు పెట్టినా ఒక్క రూపాయి కూడా చార్జీలు, ధరలు పెంచలేదన్నారు. పన్నులు పెంచకుండా, చార్జీలు పెంచకుండా సుపరిపాలన అందించిన రికార్డు సిఎం మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు.

కిరణ్‌ ప్రభుత్వానికి మనసు లేదు, మానవత్వం లేదని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. గ్యాస్‌ ధర, రిజిస్ట్రేషన్‌ చార్జీలు విపరీతంగా పెంచేశారన్నారు. లేని కరెంటుకు నాలుగు రెట్ల బిల్లులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కనీసం 3 గంటలు కూడా విద్యుత్‌ సరఫరా చేయలేక చతికిల పడిందన్నారు. అది కూడా ముక్కలు ముక్కలు చేసి రాత్రి పూట ఇస్తున్నారని విమర్శించారు. 30 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రజల మీద భారం మోపి, వినియోగదారుల రక్తం పిండి మరీ వసూలు చేస్తోందని దుయ్యబట్టారు.

ఇంత ప్రజా కంటకంగా మారిన ఈ ప్రభుత్వాన్ని దించేయాలని అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు నాయుడు దానికి వత్తాసుగా నిలిచారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. వ్యవసాయం దండగ చంద్రబాబు అన్నారని, పథకాలు అమలు చేస్తే ప్రజలు సోమరిపోతులవుతారని అవహేళన చేశారన్నారు.‌ చంద్రబాబు తన 8 ఏళ్ళ పాలనలో 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచేసి, కట్టలేని వారిని వేధించారని దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని వ్యాఖ్యానించిన చంద్రబాబును ప్రజానాయకుడనాలా? లేక దుర్మార్గుడనాలా? అని అన్నారు.

మహానేత అమలు చేసిన పథకాలను అప్పుడు అవహేళన చేసిన చంద్రబాబు ఇప్పుడు అవే పథకాలను తానూ అమలు చేస్తానంటూ ఊరూరా తిరుగుతున్నారని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. రెండెకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబుకు దేశంలో ఎక్కడ చూసినా హెరిటేజ్‌ దుకాణాలను ఎలా ఏర్పాటు చేశారని నిలదీశారు. దేశ విదేశాల్లో ఆయనకు లెక్కలేనన్ని ఆస్తులు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న కోట్లాది రూపాయల విలువైన భూములను ఐఎంజి సంస్థకు కేవలం లక్షల రూపాయలకే అప్పనంగా కట్టబెట్టేశారన్నారు. చంద్రబాబుపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటిపై విచారణ జరిగితే చంద్రబాబు ఎప్పుడో జైలుకు వెళ్ళి ఉండేవారన్నారు. ఇంత అవినీతిపరుడైన చంద్రబాబు నిన్న ఢిల్లీకి వెళ్ళి నిస్సిగ్గుగా అవినీతిపై లెక్చర్‌ ఇవ్వడమేమిటని చంద్రబాబును శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించిన విధంగా ఉందన్నారు.

మహానేత వైయస్‌ వారసుడిగా ప్రజల గుండెల్లో జగనన్న స్థిరపడడాన్ని సహించలేక కుట్రలు చేసి జైలుకు పంపించారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్న త్వరలోనే బయటకు వస్తారని, రాజన్న రాజ్యం వైపు మనలను నడిపిస్తారని భరోసా ఇచ్చారు. రాజన్న ప్రతి కలనూ జగనన్న నెరవేరుస్తారన్నారు. అమ్మ ఒడి పథకం పెట్టి విద్యార్థులను బడికి పంపించే అమ్మ ఖాతాలో ప్రతి నెలా డబ్బులు వేస్తారన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ. 700, వికలాంగులకు వెయ్యి రూపాయల పింఛన్‌ అందిస్తారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.

Back to Top