ఛార్జీల పెంపుకు నిరసనగా ధర్నా

ప్రజలపై భారం మోపి
బంగారు తెలంగాణ సాధిస్తారా..?
కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసిన పార్టీ నేతలు
ధరల పెంపును ఉపసంహరించుకోవాలి
వైయస్‌ఆర్‌ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రజలపై భారం మోపి బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీల పెంపుకు నిరసనగా శనివారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద ధర్నా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డుపై బైఠాయించి కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి ప్రగతి లేకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకు పోతుందని ధ్వజమెత్తారు. ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీలను పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారాన్ని వేసిందని మండిపడ్డారు. దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా ప్రజలపై భారాన్ని మోపలేదని గుర్తు చేశారు. 

ప్రజల బాగోగులు చూడని సీఎం కేసీఆర్‌కు బంగారు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. అనంతరం పెంచిన ఛార్జీలపై ఆందోళన చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు కొండా రాఘవరెడ్డి, కె. శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 
Back to Top