చంద్రబాబు మారని మనిషి... ఆడిన మాట తప్పడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక ప్రభుత్వాధికారులను గదమాయించడం, వేలు చూపి బెదరించడం ఆయనకు మాత్రమే తెలిసిన విద్య. అధికారులంటే ఆయనకు ఎందుకో గానీ చాలా చులకన భావం. గత తొమ్మిదేళ్ల హయాంలో చంద్రబాబు తీరుకు నొచ్చుకున్న ఎందరో అధికారులు తీరని క్షోభ అనుభవించారు. జన్మభూమి సభల్లో అధికారులను పిలిచి ప్రజల ముందు తిట్టడం, కొట్టినంత పని చేయడం చంద్రబాబుకు ఓ సరదా. ఇపుడు కూడా ఆయన ఆ సరదాను ముచ్చటగా తీర్చుకుంటున్నారు. <br/>‘‘ ఏం తమాషా చేస్తున్నారా.... మీకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చా. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి. లేకుంటే మీతో ఎలా పనిచేయించుకోవాలో నాకు తెలుసు... మీ గుండెల్లో నిద్రపోతా.. ఖబడ్దార్...’’ ఇలా ఎవరు మాట్లాడగలరు చెప్పండి. అందుకే చంద్రబాబు తీరుపై ఉద్యోగులలో మరలా చర్చ మొదలయ్యింది. ఆయన తీరు ఏ మాత్రం మారలేదంటూ నిట్టూర్చుతున్నారు. చిత్తూరుజిల్లా రేణిగుంట మండలం సీ మల్లవరంలో జరిగిన జన్మభూమి మావూరు కార్యక్రమంలో తన నిజస్వరూపాన్ని చంద్రబాబు మరోమారు బైటపెట్టుకున్నారని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. తాను మారానని చంద్రబాబు చెప్పిన మాటల్లో నిజం లేదని వారికి తెలిసి వచ్చింది. అనవసరమైన సభలు, సమీక్షల పేరుతో సాధారణ విధులకు భంగం కలగ జేయడం ఆయనకు పరిపాటేనని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. జన్మభూమి- మావూరు కార్యక్రమానికి సంబంధించిన సభకు అన్ని ఏర్పాట్లు అధికారులు దగ్గరుండి పూర్తి చేశారు. అయితే ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందున సమావేశానికి హాజరు కాలేదు. అయితే అధికారుల పరిస్థితిని అర్ధం చేసుకోకుండా వేదికపైకి చేరగానే ‘‘ఎంపీడీవో ఎవరు... మీటింగ్ కండక్ట్ చేసిన టీం లీడర్ ఎవరు.. ఇక్కడ సిస్టం, ఆఫీసర్స్ టీమ్ ఉండాలి కదా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు గద్దించారు. దాంతో ఉద్యోగులు తీవ్రంగా ఆందోళన పడ్డారు. మైక్లో పిలిచినప్పటికీ అధికారులెవరూ వేదికపైకి వచ్చే సాహసం చేయలేకపోయారు. కోడ్ ఉంటే ఇంకొక ఆఫీసర్ ఉండాలి కదా అంటూ చంద్రబాబు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, ఆర్డబ్ల్యూస్ ఎస్ఈని బలవంతంగా వేదికపైకి పిలపించి వారిపై ఆగ్రహంగా పరుషవ్యాఖ్యలు చేయడం మిగిలిన అధికారులను కూడా కలచివేసింది. ‘శాంక్షన్ చేసి ఇంట్లో పడుకుంటే ఎలా? ఆఫీసర్స్ తమాషాగా తీసుకుంటున్నారు’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని సమావేశానికి వచ్చిన అధికారులు చర్చించుకోవడం కనిపించింది.