రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన: విజయమ్మ

చిలకలూరిపేట, 24 జూన్ 2013:

రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలకూ, ప్రజలకూ తమ కుటుంబం అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సోమవారం ఉదయం ఏర్పాటైన  పార్టీ ప్రాంతీయ సదస్సులో ఆమె ప్రసంగించారు. రాజశేఖర రెడ్డి గారికి దాచుకోవడం, దోచుకోవడం తెలియదని  స్పష్టంచేశారు. లక్ష కోట్ల రూపాయలతో దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ జలయజ్ఞం పథకం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని కార్యకర్తలను కోరారు. ప్రజల్లో పార్టీకి మంచి ఆదరణ ఉందని చెప్పారు. రిజర్వేషన్లలో అక్రమాలుంటే కోర్టుకు వెళతామని ఆమె హెచ్చరించారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి కూడా ప్రజలకు వివరించాలని చెప్పారు. ఆరోగ్యశ్రీలో వందకుపైగా వ్యాధులను తొలగించారు. 108కి ఫోన్ చేస్తే వాహనం ఎప్పుడు వస్తుందో తెలియదు. గ్రామసభల అనుమతిలేకుండానే పనులు జరుగుతున్నాయని తెలిపారు. కరెంట్ కోతలతో గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలంటే భయంలేదని కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఆయన భయం ఎవరికి కావాలట అన్నారు. కేంద్ర నుంచి పంచాయతీలకు రావలసిన నిధులు ఆగిపోయాయన్నారు. నవంబరు వరకూ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు రాకుండా కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు హయాంలో గ్రామపంచాయితీలకు నిధులు ఎందుకన్నారన్న విషయాన్ని శ్రీమతి విజయమ్మ  గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికలలో కూడా కుమ్మక్కు కుట్రలు సాగుతున్నాయన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార దర్పం ప్రదర్శంచే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్, టిడిపిలకు ఎందుకు ఓటేయాలని ఆమె ప్రశ్నించారు.

తొలుత సమావేశంలో ఉత్తరాఖండ్ విపత్తులో చనిపోయినవారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతం విరాళంగా ఇస్తారని శ్రీమతి విజయమ్మ ప్రకటించారు.చంద్రబాబుకు ఎందుకు ఓటేయాలో అందరూ ఆలోచించుకోవాలన్నారు. వైయస్ఆర్  కుటుంబం గురించి ఎన్నో మాట్లాడుతున్నారు.. మీరంతా నాకు అత్యంత ఆప్తులు. తన జీవితం తెరిచిన పుస్తకమని రాజశేఖరరెడ్డిగారు ఎప్పుడూ చెబుతుండేవారన్నారు. సీబీఐ వైఖరిని ఆమె తప్పుపట్టారు. దర్యాప్తునకు కొన్ని పేరాలేనే ఆ సంస్థ తొలగించిన సంఘటనను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాజశేఖరరెడ్డిగారున్నప్పుడు ఇంద్రుడు, చంద్రుడన్న వారే ఇప్పుడు 26 జీవోల కేసు ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు చేర్చారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డిపై ఏ కేసూ లేదన్నారు. పార్టీని వీడిన వారంరోజుల్లోనే ఐటీ నోటీసులు అందాయని విజయమ్మ చెప్పారు. జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు చూపించిన ప్రేమ, ఆదరణలు తట్టుకోలేక కాంగ్రెస్, టీడీపీలు కోర్టుకు వెళ్ళాయని చెప్పారు. కోర్టు ఇచ్చిన సమయంలో ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పలేకపోయిందన్నారు. సీబీఐ 28 బృందాలతో జగన్మోహన్ రెడ్డిపైనే కాక.. మిగిలిన భాగస్వాముల ఇళ్ళపై కూడా దాడులు చేసిందన్నారు. సీఆర్పీసీ నిబంధన ప్రకారం ఒక చార్జిషీటే ఉండాలన్నదానిని సీబీఐ తోసి రాజందని పేర్కొన్నారు. విచారణకు మూణ్ణెల్లు పడుతుందన్నా ఆర్నెల్లు కోర్టు సమయమిచ్చిందన్నారు. మళ్ళీ మరో సారి నాలుగు నెలలు సమయమిచ్చిందన్నారు. అప్పుడే సీబీఐ లాయర్ మరి కొంత సమయం అడుగుతామని చెప్పడం ఎంతవరకూ సమంజసమన్నారు. విచారణకు రావల్సిందిగా సమన్లిచ్చి అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఓ పార్టీ అధ్యక్షుణ్ణి కాబట్టి తనకు 15 రోజులు సమయం ఇవ్వాలనీ, తనను అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తున్నారనీ జగన్ బాబు దాఖలు చేసిన అఫిడవిట్‌ను జడ్జి కొట్టేస్తూ అవన్నీ భయాలేనని చెప్పారన్నారు. చివరికి జరిగిందేమిటో అందరకీ తెలిసిందేనని ఆమె పేర్కొన్నారు. అభియోగం మోపేముందు కూడా కనీసం జగన్ అభిప్రాయాన్ని తెలుసుకోలేదన్నారు. మంత్రులుగా ఉన్నవారిని విచారించకుండా 52వ ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఒకటో ముద్దాయిగా మార్చి అరెస్టు చేశారన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తారనే సాకు చూపించారన్నారు. మంత్రులు ప్రభావితం చేయలేనిది అధికారంలోనే లేని జగన్ ఎలా ప్రభావితం చేస్తారని ఆమె ప్రశ్నించారు.

లక్ష కోట్లు అవినీతని చెప్పి 43 వేల కోట్లని చార్జిషీట్లో పెట్టారనీ, సీబీఐ కోర్టు అడిగితే వెయ్యి కోట్లేనని అంటున్నారనీ తెలిపారు. లక్ష కోట్లంటే ఎన్ని లారీల్లో పడతాయో చంద్రబాబు లెక్క వేసి చెప్పారనీ.. ఇలాంటి విషయాలు ఆయనకు తెలియడంలో ఆశ్చర్యం లేదనీ శ్రీమతి విజయమ్మ ఎద్దేవా చేశారు. మహానేత ముఖ్యమంత్రి కాకముందే జగన్ బాబు సాండూర్ అనే పవర్ ప్రాజెక్టు ఉందన్నారు. భారతీ సిమెంట్సులో పెట్టుబడులకు రెండింతలు లాభాలు వచ్చాయన్నారు. ఇంత లాభాలు వస్తున్నప్పుడు క్విడ్ ప్రోకోకు పాల్పడవలసిన అవసరమేముంటుందని ఆమె ప్రశ్నించారు. ఈనాడు, జ్యోతి మినహా మరో పేపరు ఉండకూడదు.. కాంగ్రెస్, టీడీపీ తప్ప మరో పార్టీ ఉండకూడదన్న ధ్యేయంతో అధికార విపక్షాలు పనిచేస్తున్నాయనీ.. ఈ కారణంగానే సాక్షి పత్రికకూ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకీ ఇబ్బందులు సృష్టిస్తున్నాయని తెలిపారు. బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారు.. అటాచ్ మెంట్ చేస్తున్నారన్నారు. సాక్షి షేర్లు ఎక్కువ ధరకు అమ్ముడవుతుండడమే దీనికి కారణమన్నారు. పెట్టుబడులు పెట్టిన వారందరికీ జగన్ బాబు షేర్ పత్రాలు ఇచ్చారన్నారు. జగన్ బాబు, భారతి సాక్షినుంచి జీతం కూడా తీసుకోవడం లేదన్నారు. బెంగళూరులో తన కుమారుడు, కుమార్తె వ్యాపారం చూసుకుంటున్నారనీ అక్కడ ఇల్లుంటే తప్పేమిటని తెలిపారు. హైదరాబాద్ లోని ఇంటిలో 72 గదులున్నాయని చెబుతున్నారన్నారు. నా ఇంట్లో మూడు బెడ్ రూములు, జగన్ బాబు, షర్మిల ఇళ్ళలో నాలుగేసి బెడ్ రూములు ఉన్నాయని ఆమె స్పష్టంచేశారు. ఎస్కవేటర్లు ఉన్నాయని చెబుతున్నారనీ.. తన ఇంట్లో మాత్రమే లిఫ్టు ఉందనీ, జగన్ బాబు ఇంట్లో అది కూడా లేదనీ ఆమె తెలిపారు. మున్సిపల్ ఆఫీసులో దీనికి సంబంధించిన వివరాలిస్తారనీ, ఎవరైనా చూస్తారనీ చెప్పారు. ఎన్నో ఏళ్ళ క్రితమే.. రాజశేఖరరెడ్డిగారు పులివెందులలోని కొండమీద లయోలా కాలేజీ భవనాన్ని కట్టించి ఇచ్చారని తెలిపారు. అలాంటయన్ని ప్రస్తుతం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. మహానేతకు దాచుకోవడమూ, దోచుకోవడమూ తెలీదని స్పష్టంచేశారు. శ్రీమతి వైయస్ భారతి కూడా ఒక పాఠశాల నడుపుతున్నారనీ, అందులోని విద్యార్థులకు అన్నీ ఉచితంగా అందిస్తారనీ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇంతవరకూ ఏదీ నిర్థారణ చేయలేకపోయారని చెప్పారు.

అనంతరం.. వైయస్ఆర్ కాంగ్రెస్ చేపట్టే సంక్షేమ పథకాలను శ్రీమతి విజయమ్మ సోదాహరణంగా వివరించారు.

Back to Top