కాంగ్రెస్, టీడీపీ కుట్రలకు చెక్‌ పెడదాం

పుత్తూరు (చిత్తూరు జిల్లా):

అడ్డగోలుగా, నిరంకుశంగా జరుగుతున్న రాష్ట్ర విభజనను అడ్డుకోకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్ని కబుర్లు చెప్పినా ప్రజలు నమ్మబోరని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ‘జగన్ చెప్పింది చేస్తాడు. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళతాడు’ అన్న నమ్మకం సంపాదించుకోగలిగానని శ్రీ జగన్ అన్నారు. దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి నుంచి వారసత్వంగా ‘విశ్వసనీయత’ను తాను సంతరించుకున్నానని ఆయన గర్వంగా చెప్పారు.

ప్రజా సమస్యలను పక్కనపెట్టి, మెజారిటీ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అని అసెంబ్లీలో పాలక, ప్రతిపక్ష నేతలు చేస్తున్న చర్చలు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. సోనియా గీసిన గీత దాటకుండా ఎంతకాలం వీలైతే అంతకాలం సీఎం కుర్చీలో ఉండేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి తాపత్రయ పడుతున్నారని, అధికారపక్షంతో అంటకాగుతూ రాష్ట్రాన్ని చీల్చేందుకు చంద్రబాబు తనవంతు సహకారాన్ని అందిస్తున్నారని శ్రీ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాలో నాలుగవ విడత ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ను శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. తొలిరోజు యాత్రలో భాగంగా ఆయన వడవాలపేట, పుత్తూరు సభల్లో ప్రసంగించారు.

ఇంత దారుణంగా దిగజారిపోయిన రాజకీయ వ్యవస్థను, రాజకీయ నాయకులను చూస్తుంటే మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి మరీ మరీ గుర్తుకొస్తున్నా‌రని శ్రీ జగన్‌ చెప్పారు. రాజకీయాల్లో విశ్వసనీయతకు అర్థం చెప్పిన ఆ మహానేత జీవించి ఉంటే మన రాష్ట్రాన్ని విభజించే సాహసం ఎవరైనా చేయగలిగేవారా? అని ఆయన అన్నారు. దిగజారుడు, కుమ్మక్కు రాజకీయాలకు చరమగీతం పాడి ‘సమైక్య రాష్ట్రం’ దక్కించుకునే కృషిలో భాగస్వాములు కావాలని శ్రీ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

‌అందరి గుండె చప్పుడూ సమైక్యాంధ్ర :
‘చదువుకున్న ప్రతి పిల్లవాడి గుండె చప్పుడు జై సమైక్యాంధ్ర. ప్రతి రైతన్న మదిలో మెదిలే ఒకే మాట జై సమైక్యాంధ్ర. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ సముద్రపు నీరు తప్ప మంచినీరు లభించని ప్రమాదపుటంచున ఉన్న ప్రతి ఒక్కరి గుండె చప్పుడు సమైక్యాంధ్ర. ఇందరి మనోభీష్టానికి వ్యతిరేకంగా సీట్లు, ఓట్ల కోసం కుమ్మక్కు కుట్రతో రాష్ట్రాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తీరు చూస్తే రాష్ట్రంలో రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో అర్థమవుతుంది. ఓట్లు, సీట్ల కోసం ఎంత నీచానికైనా పాల్పడే పరిస్థితులు ఉన్నాయి. సోనియా గాంధీ గీచిన గీత దాటకుండా ప్రజలను మోసం చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రాంతమంతా సమైక్యం కోసం ఒక్క గొంతుతో నినదిస్తున్న వేళ ఉద్యోగులను బెదరించి సమ్మె విరమింపజేశారు. ఢిల్లీ నుంచి బిల్లు రాగానే ఆగమేఘాల మీద తాను సంతకం చేయడమే కాక ప్రభుత్వ కార్యదర్శులతో కూడా సంతకాలు చేయించి 17 గంటల్లోనే బిల్లును అసెంబ్లీకి పంపారు. ఇలా విభజన కోసం చేసేవన్నీ చేస్తూ కిరణ్ పైకేమో సమైక్యవాది ముసుగుతో జనాన్ని మోసం చేస్తున్నారు‌' అని విమర్శించారు.

నిలదీయాల్సిన చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లున్నారు :
`ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీలో తమ సీమాంధ్ర ఎమ్మెల్యేలతో  సమైక్యాంధ్ర అనిపిస్తారు. తెలంగాణ వారి చేత విభజన మాట పలికిస్తారు. విభజనకు అనుకూలంగా మీరిచ్చిన లేఖను ఎందుకు వెనక్కు తీసుకోరు చంద్రబాబూ? ఇంత వరకూ సమైక్యమన్న మాటే మీ నోటి వెంట ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నా. రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చే ప్రయత్నం చేస్తున్న సోనియాను, కిరణ్‌కుమార్‌రెడ్డిని కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన చంద్రబాబు ఆ పని చేయకుండా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపే హామీ‌లు ఇస్తున్నారు. అన్నీ ఉచితంగా ఇస్తానంటూ ‘ఆల్ ఫ్రీ బాబు’గా కొత్త అవతారం ఎత్తుతున్నార'ని విమర్శించారు.

'‌తొమ్మిదేళ్లు అధికారంలో ఉండగా కరవు రైతుల అప్పులపై వడ్డీ మాఫీచేయని చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వస్తే మొత్తం అప్పులే రద్దుచేస్తారట. హార్సుపవర్ విద్యు‌త్ చార్జీలు రూ.50 నుంచి రూ.625కి పెంచిన చంద్రబాబు, ఉచిత విద్యు‌త్ ఇస్తే తీగలపై బట్ట‌లు ఆరేసుకోవాల్సిందే అన్న చంద్రబాబు ఇప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తారట. ఎన్నికల ముందు మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన ఆయన అధికారంలోకి రాగానే మద్యనిషేధం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని ‘ఈనాడు’లో పెద్ద పెద్ద వార్తలు రాయించుకున్నారు. చివరకు ఊరూరా బెల్టుషాపులు వెలిసేలా చేశారు‌' అని ఎద్దేవా చేశారు.

ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న పోరులో కుటిల, కుమ్మక్కు రాజకీయాలకు తగిన బుద్ధి చెపుదాం. త్వరలో ఎన్నికలు వస్తాయి. మనమే సొంతంగా 30 మంది ఎంపీలను గెలిపించుకుందాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వ్యక్తినే ప్రధాని పదవిలో కూర్చోబెడదాం అని శ్రీ జగన్‌ పిలుపునిచ్చారు.

Back to Top