వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి తీవ్రమైన వెన్నునొప్పి

హైదరాబాద్, 9 అక్టోబర్ 2013:

రాష్ట్రాన్ని అడ్డగోలుగా, నిరంకుశంగా విభజించాలని కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ.. సమైక్యాంధ్రకు మద్దతుగా ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యం బుధవారం ఉదయానికి మరింతగా క్షీణించింది. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఆయన దీక్ష కొనసాస్తుండటంతో బాగా నీరసించిపోయారని వైద్యులు తెలిపారు. శ్రీ జగన్‌కు బుధవారం ఉదయం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శరీరంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గిపోయాయని, వైద్యానికి శ్రీ జగన్ సహకరించాలని వైద్యులు కోరారు.

‌ఒకే నెలలో రెండవసారి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న శ్రీ జగన్ నాలుగవరోజు ‌మంగళవారానికే బాగా నీరసంగా కనిపించారు. అయినప్పటికీ తనను కలిసేందుకు వచ్చిన వారిని అదే చిరునవ్వుతో పలుకరిస్తూ అభివాదం చేశారు. వృద్ధులు, మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు, పిల్లలతో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన వారందరితో నిలబడి ఎంతో ఓపికగా మాట్లాడారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతగా దీక్షా శిబిరం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.‌ నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఈ శిబిరంలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నా‌థ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు అన్ని వర్గాల ప్రజలు సంఘీభావంగా నిలుస్తున్నారు. శ్రీ జగన్ దీక్షకు గ్రేట‌ర్ హైదరాబా‌ద్ పాస్ట‌ర్లు మద్దతు ప్రకటించారు. శ్రీ జగన్ దీక్ష విజయవంతం కావాలంటూ‌ వారు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు.

Back to Top